రూపాయి పతనం, భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

రూపాయి పతనం, భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
x

రూపాయి పతనం, భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

Highlights

రూపాయి విలువ ఎందుకు పతనమైంది? డాలర్‌తో రూపాయి మారకం రూ 90.20 43 పైసల నష్టంతో 89.96 వద్ద ముగింపు సరికొత్త జీవితకాల కనిష్ఠానికి రూపాయి ఆసియాలో అత్యధికంగా నష్టపోయిన కరెన్సీ

రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా 90 రూపాయల మైలురాయికి చేరింది. చివరికి 43 పైసల నష్టంతో 89.96 దగ్గర ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్ఠ ముగింపు కూడా. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటం, దిగుమతిదారుల నుంచి అమెరికన్‌ కరెన్సీకి డిమాండ్‌ పెరగడం, ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, స్పెక్యులేషన్‌ ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. ఆసియాలోకెల్లా అత్యధికంగా నష్టపోయిన కరెన్సీ మనదేనని చెబుతున్నారు.


అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో రూపాయి విలువ తొలిసారిగా 90 మార్క్‌ను దాటి సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత సెషన్ ముగింపులో 89.96 వద్ద ఉన్న రూపాయి, ట్రేడింగ్ ప్రారంభం నుంచే బలహీన ధోరణి ప్రదర్శించింది. ఒక దశలో ఏకంగా 90.14 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్ఠాన్ని తాకింది.రూపాయి క్షీణతకు ప్రధాన కారణాలుగా దిగుమతిదారుల వైపు నుంచి డాలర్‌కు ఊహించని డిమాండ్‌, మార్కెట్‌లో జరుగుతున్న షార్ట్ కవరింగ్‌, అలాగే గ్లోబల్ మారకద్రవ్య ద్రవ్యోల్బణం ఒత్తిడి వ్యవహారాలు నిలిచాయి. భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై నెలకొన్న అనిశ్చితి కూడా విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబున్నారు. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం రూపాయి బలపడే అవకాశాలను తగ్గించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఇదే ధోరణి కొనసాగితే రూపాయి విలువ 91 మార్క్‌ను చేరే అవకాశముంది. ఈ బలహీనత ఇంకా కొన్నిరోజులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడుతున్న దృష్ట్యా రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రూపాయి బలహీనతతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా అదే రీతిలో దిగజారాయి. బుధవారం ఉదయం నుంచే ప్రతికూల సంకేతాలు కనిపించాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు కోల్పోయి 84,897 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 25,928 వద్ద కదులాడుతూ కనిపించింది. ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఒత్తిడి కొనసాగుతుండడంతో బెంచ్‌మార్క్ సూచీలు రెడ్ జోన్‌లోనే ఉన్నాయి. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు మార్కెట్లో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి.


సాధారణంగా అమెరికా డాలర్ డిమాండ్ పెరిగినప్పుడు భారత రూపాయి విలువ తగ్గుతుంది. రూపాయి డిమాండ్ పెరిగినప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది. దాదాపు అన్ని దేశాల కరెన్సీ మీద ఇలాంటి ఎఫెక్ట్ ‌‌ ఉంటుంది. అంటే.. ఇంటర్నేషనల్​ మార్కెట్​లో డాలర్లకు డిమాండ్​ పెరిగిందనుకోండి. అప్పుడు మనదేశం ఎక్కువ రూపాయలు ఇచ్చి డాలర్లను కొనుక్కుంటుంది. ఎగుమతులు పెరిగినప్పుడు ఆదాయం డాలర్లలో వస్తుంది. ఆ డాలర్లు మన దేశ కంపెనీల యజమానులు రూపాయల్లోకి మార్చుకుంటారు. అప్పుడు మన దగ్గర డాలర్ల నిల్వలు పెరుగుతాయి. రూపాయికి డిమాండ్​ పెరుగుతుంది. ఒకవేళ మన దేశ కంపెనీలు దిగుమతులు ఎక్కువగా చేసుకుంటే.. ఇందుకు మారకం డాలర్ల రూపంలో చెల్లించాలి. కాబట్టి డాలర్​కు డిమాండ్ పెరిగి, రూపాయి విలువ తగ్గుతుంది. రోజుల్లో రూపాయి పతనం ఆగాలంటే ఆర్‌బీఐ జోక్యం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం కీలకంగా మారనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.


అసలు రూపాయి విలువ పతనమైతే ఎందుకింత ఆందోళన.. దీని కారణంగా ఏర్పడే పరిణామాలు ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన అసవరం ఉంది. ఒక దేశ కరెన్సీ చాలా బలహీనపడితే, గ్లోబల్ మార్కెట్లలో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు వచ్చి పెట్టుబడులు తగ్గవచ్చు.

రూపాయి విలువ తగ్గితే.. క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.దిగుమతులు ఖరీదవడం వల్ల, ఆ ఖర్చులు వినియోగదారులపై పడతాయి. దీని కారణంగా సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి.

విదేశాలకు వెళ్ళేవారికి ఖర్చులు అధికమవుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, జీవన వ్యయం ఇంకా ఖరీదవుతుంది.


భారత్ మొత్తం క్రూడ్ ఆయిల్‌లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది. రూపాయి విలువ తగ్గిపోతే ఆయిల్ ధర పెరగడంతో రవాణా, తయారీ, వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి.

సంస్థలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలు రూపాయి బలహీనత వల్ల ఖరీదవుతాయి. వడ్డీ చెల్లింపులు పెరిగి, ఆర్థిక భారంగా మారుతాయి.

రూపాయి పడిపోతే కొందరు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు గురవుతాయి.

రూపాయి బలహీనపడితే, భారతదేశం నుండి వస్తువులు కొనుగోలు చేసే విదేశీ క్లయింట్లకు అవి తక్కువ ఖర్చుతో అందుతాయి.టెక్స్‌టైల్, ఐటీ సేవలు, ఔషధాలు వంటి రంగాలకు కొంత ప్రయోజనం.

గ్లోబల్ ఆర్థిక ఒత్తిడులు, విదేశీ పెట్టుబడిదారుల ప్రవర్తన, డాలర్ బలపడటం, అలా అన్నీ కలిసి రూపాయి విలువపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి.


ప్రస్తుతం అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ రూ 90.20గా ఉంది.. అయితే మన ఇరుగు పొరుగు దేశాల మారటం రేట్లు ఇలా ఉన్నాయి

పాకిస్తాన్ మారకం విలువ రూ.280.45.. శ్రీలంక రూ. 308.13,

నేపాల్ రూ. 143.64, బంగ్లాదేశ్ 121.93 టాకాలు,

భూటాన్ 88.77 నుగుట్రమ్స్, అఫ్గానిస్తాన్ 66.25 అఫ్గానీస్

మాల్దీవ్స్ 15.40 రూఫియా, మయన్మార్ 2,099.58 బర్మీస్ క్యాట్

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 1947లో డాలర్‌-రూపాయి మారకం విలువ రూ.3.3.. 1990 దశకం వరకు చాలా నెమ్మదిగానే తగ్గుతూ వచ్చింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో (1991) తొలి తరం ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పటి నుంచి రూపాయి విలువ వేగంగా కరుగుతూ వచ్చింది. నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014లో రూ.62 స్థాయిలో ఉన్న రూపా యి మారకం విలువ.. గడిచిన 11 ఏళ్లలో మరింత వేగంగా క్షీణిస్తూ వచ్చింది. ఏటేటా పెరుగుతూ వస్తున్న వాణిజ్య లోటు, ముడి చమురు, పసిడి సహా పలు దిగుమతులపై ఆధారం పెరగడం, అధిక ధరలు వంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories