UPS: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఎన్‌పీఎస్ లాగే యూపీఎస్‌కు పన్ను ప్రయోజనాలు

UPS
x

UPS: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఎన్‌పీఎస్ లాగే యూపీఎస్‌కు పన్ను ప్రయోజనాలు

Highlights

UPS: రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కు ఉన్న పన్ను ప్రయోజనాలు అన్నీ, ఇప్పుడు కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కూడా వర్తిస్తాయి.

UPS: రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కు ఉన్న పన్ను ప్రయోజనాలు అన్నీ, ఇప్పుడు కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కు కూడా వర్తిస్తాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం 2025 జనవరి 24న ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకం 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్‌లో కొత్తగా చేరే ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌కు బదులుగా ఈ యూపీఎస్ పథకం అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, ఇప్పటికే ఎన్‌పీఎస్‌లో ఉన్న ఉద్యోగులకు ఒకసారి యూపీఎస్‌లోకి మారే అవకాశం కూడా కల్పించారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ 2025 మార్చి 19న యూపీఎస్‌కు సంబంధించిన నియమావళిని విడుదల చేసింది.

యూపీఎస్‌కు కూడా ఎన్‌పీఎస్ లాగే పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల ఇప్పుడు రెండు పథకాలకు సమానత్వం వచ్చింది. దీనివల్ల ఉద్యోగులకు పన్నుల్లో భారీగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, ఈ కొత్త పథకాన్ని స్వీకరించడానికి వారికి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ప్రభుత్వం ట్యాక్స్ ఫ్రెండ్లీ రిటైర్‌మెంట్ స్కీమ్స్ అందించాలనే లక్ష్యాన్ని ఈ నిర్ణయం సూచిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎన్‌పీఎస్‌పై ఉన్న అతిపెద్ద విమర్శ ఏమిటంటే, ఇందులో గతంలో ఉన్న డిఫైన్డ్ బెనిఫిట్ సిస్టమ్ లేదు. అంటే, ఖచ్చితమైన నెలవారీ పెన్షన్ లభించదు. ఎన్‌పీఎస్‌లో మీరు నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. కానీ దానిపై వచ్చే రాబడి మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల రిటైర్‌మెంట్ తర్వాత ఎంత మొత్తం వస్తుందో చెప్పలేం. అది అనిశ్చితంగా ఉంటుంది.

కానీ యూపీఎస్ లో ఖచ్చితమైన పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది. దీని ప్రకారం ఉద్యోగి 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసి ఉంటే చివరి 12 నెలల సగటు జీతంలో 50శాతం పెన్షన్‌గా వస్తుంది. సర్వీసు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నవారికి, నెలకు కనీసం రూ.10,000 పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది. 10 నుండి 25 సంవత్సరాల మధ్య పనిచేసిన వారికి అదే నిష్పత్తిలో పెన్షన్ ఇస్తారు.పెన్షన్‌లో ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెరుగుదల కూడా ఉంటుంది. ఇది ఎన్‌పీఎస్‌లో లేదు.

ఉద్యోగులు తమ బేసిక్ సాలరీ, డీఏలో 10శాతం సహకారం అందిస్తారు. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, అదనంగా 8.5శాతాన్ని స్పెషల్ ఫండ్ లో జమ చేస్తుంది. ఈ విధంగా యూపీఎస్‌లో ప్రభుత్వం మొత్తం 18.5% వాటా ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో ఇది కేవలం 14% మాత్రమే. యూపీఎస్‌లో ఒకేసారి చెల్లించే మొత్తం కూడా లభిస్తుంది. ప్రతి 6 నెలల సర్వీసుకు, మూల వేతనం + DA లో 1/10వ వంతు లభిస్తుంది. అంటే, 25 సంవత్సరాల సర్వీసుకు దాదాపు 5 నెలల జీతం ఒకేసారి వస్తుంది. యూపీఎస్ దీర్ఘకాలికంగా ఎన్‌పీఎస్ కంటే మెరుగైన రిటర్న్స్ ఇవ్వగలదు. ఒక ఉద్యోగి 25 సంవత్సరాల వయస్సులో యూపీఎస్ లో చేరితే, అతని జీవితకాల రాబడి 9.37% గా అంచనా వేశారు. అదే లాభాన్ని పొందడానికి ఎన్‌పీఎస్‌కు 12.24% వార్షిక రాబడి అవసరం. ఉద్యోగి వయస్సు పెరిగే కొద్దీ, యూపీఎస్ ప్రయోజనం మరింత పెరుగుతుంది. కాబట్టి, రిటైర్‌మెంట్ దగ్గర పడుతున్న వారికి ఈ పథకం చాలా లాభదాయకం అని భావిస్తున్నారు. ప్రభుత్వం యూపీఎస్‌కు పన్ను ప్రయోజనాలను ఇవ్వడమే కాకుండా, దీనిని ఒక సురక్షితమైన, స్థిరమైన పెన్షన్ పథకంగా ప్రవేశపెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories