
30 వేల టన్నులు..452 లక్షల కోట్ల సంపద..మన ఇళ్లల్లో ఉన్న బంగారం లెక్కలివి
Indian Gold Reserves : భారతదేశంలో బంగారం అంటే కేవలం మెడలో మెరిసే ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం, తరతరాల వారసత్వం, ఆపదలో ఆదుకునే ప్రాణస్నేహితుడు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఇష్టపడే దేశం మనదే. అయితే భారతీయ ఇళ్లల్లో మూలుగుతున్న ఈ పసిడి సంపద ఎంత? దాని విలువ మన దేశ వార్షిక ఆదాయం కంటే ఎందుకు ఎక్కువగా ఉంది? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాజా నివేదికల ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ దేశ ఆర్థిక వ్యవస్థనే సవాల్ చేసే స్థాయిలో ఉండటం విశేషం.
జీడీపీని మించిపోయిన పసిడి సంపద
నిపుణుల అంచనా ప్రకారం.. భారతీయ ఇళ్లల్లో దాదాపు 30 వేల టన్నుల బంగారం నిల్వ ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ అక్షరాలా 5 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.452 లక్షల కోట్లు). ఈ అంకె వింటేనే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మన దేశ మొత్తం వార్షిక ఉత్పత్తి (జీడీపీ) కంటే ఈ బంగారు సంపద విలువ ఎక్కువ. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 2025-26లో భారత జీడీపీ 4.125 ట్రిలియన్ డాలర్లు కాగా, మన ఇళ్లల్లో ఉన్న పసిడి విలువ 5 ట్రిలియన్ డాలర్లు. అంటే దేశం మొత్తం మీద ఏడాది పొడవునా మనం కష్టపడి సంపాదించే సంపద కంటే, మన లాకర్లలో దాచుకున్న బంగారమే ఎక్కువ విలువైనదన్నమాట.
ధరలు ఎందుకు పెరిగాయి?
2025లో బంగారం ధరలు ఏకంగా 65 శాతం మేర పెరిగి రికార్డు సృష్టించాయి. అంతర్జాతీయంగా డాలర్ విలువలో అస్థిరత, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన మార్గంగా భావించారు. రష్యా-ఉక్రెయిన్, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కూడా పసిడికి రెక్కలు వచ్చేలా చేశాయి. దీనివల్ల సామాన్య ప్రజలు గతంలో కొన్న బంగారం విలువ ఇప్పుడు రెట్టింపు కావడంతో, భారతీయుల నికర సంపద అమాంతం పెరిగిపోయింది.
సంప్రదాయం నుంచి పెట్టుబడి వైపు..
ఒకప్పుడు బంగారాన్ని కేవలం లాకర్లలో దాచుకోవడానికే ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఆలోచనా విధానం మారుతోంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్గా ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. గోల్డ్ లోన్లు తీసుకోవడం, ఫిజికల్ గోల్డ్‌కు బదులుగా గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. దీనివల్ల అటు ప్రజలకు వడ్డీ ఆదాయం రావడంతో పాటు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చలనం కలుగుతోంది. ఇళ్లలో నిల్వ ఉన్న ఈ 30 వేల టన్నుల బంగారం గనుక బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తే, భారతదేశం ప్రపంచంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా మారుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




