Car Insurance : నో పార్కింగ్ జోన్ లో కారు పార్కింగ్ చేస్తే.. చోరీ అయినా ఇన్సూరెన్స్ డబ్బులు రావా?

Car Insurance
x

Car Insurance : నో పార్కింగ్ జోన్ లో కారు పార్కింగ్ చేస్తే.. చోరీ అయినా ఇన్సూరెన్స్ డబ్బులు రావా?

Highlights

Car Insurance : మీ కారు చోరీ అయితే ఇన్సూరెన్స్ డబ్బులు వెంటనే వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాట్లు కూడా జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తాయి.

Car Insurance : మీ కారు చోరీ అయితే ఇన్సూరెన్స్ డబ్బులు వెంటనే వస్తాయని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాట్లు కూడా జీవితాంతం కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ కు చెందిన పునీత్ అగర్వాల్ జీవితంలో జరిగింది. 2003లో ఆయన కొత్త కారు చోరీ అయితే, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఆయనకు 20 ఏళ్ల తర్వాత వచ్చాయి. అది కూడా చాలా తక్కువ మొత్తం. పునీత్ అగర్వాల్ 2003 మార్చి 10న కొత్త మారుతి ఆల్టో కారు కొన్నారు. అదే రోజు రూ.1.9 లక్షలకు ఇన్సూరెన్స్ కూడా చేయించుకున్నారు. ఒక నెల తర్వాత, ఏప్రిల్ 6న, ఆయన హరిద్వార్‌లోని హర్ కీ పౌడీ వద్ద తన కారును పార్క్ చేసి, పూజకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి కారు కనిపించలేదు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి FIR నమోదు చేయించారు. ఇన్సూరెన్స్ కంపెనీకి, బ్యాంకుకు కూడా సమాచారం ఇచ్చారు. జనవరి 2004 నాటికి అన్ని అవసరమైన పత్రాలను సమర్పించారు.

అయితే, పునీత్ అగర్వాల్‌కు షాక్ తగిలింది. ఎందుకంటే, ఇన్సూరెన్స్ కంపెనీ ఆయన క్లెయిమ్‌ను తిరస్కరించింది. “మీ కారును సురక్షితమైన పార్కింగ్ స్థలంలో ఉంచలేదు, అందుకే దొంగలించారు” అని కారణం చూపించింది. పునీత్ ఎన్నిసార్లు లెటర్లు రాసినా, కంపెనీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించక తప్పలేదు.

పునీత్ అగర్వాల్ గాజియాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, మొదట్లో ఆ ఫిర్యాదును కమిషన్ తిరస్కరించింది. ఈ కేసు తమ పరిధిలో రాదని చెప్పింది. దీంతో ఆయన 2011లో లక్నోలోని రాష్ట్ర కమిషన్ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత, 2025 ఫిబ్రవరిలో రాష్ట్ర కమిషన్ ఈ కేసు గాజియాబాద్ కమిషన్ పరిధిలోనే వస్తుందని పేర్కొంది. చివరకు, 20 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత, 2025 జూలైలో గాజియాబాద్ కమిషన్ పునీత్ అగర్వాల్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది.

కమిషన్ తీర్పు ప్రకారం, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కారు ఇన్సూరెన్స్ కోసం రూ.1.4 లక్షలు, మానసిక క్షోభ, లీగల్ ఖర్చుల కోసం అదనంగా రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం 2003లో కారు ఇన్సూరెన్స్ చేసిన అసలు విలువలో కేవలం 75% మాత్రమే. అగర్వాల్‌కు మొత్తం రూ.1.48 లక్షలు వచ్చాయి. ఈ మొత్తం 45 రోజుల్లోపు చెల్లించకపోతే, 6% వార్షిక వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ తెలిపింది. 2003లో రూ.1.9 లక్షల విలువకు 5% ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కించినా, 2025 నాటికి దాని విలువ దాదాపు రూ.5.56 లక్షలు అవుతుంది. కానీ, పునీత్ అగర్వాల్‌కు వచ్చింది మాత్రం కేవలం రూ.1.48 లక్షలే. ఈ డబ్బుతో ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనలేని పరిస్థితి. అంతేకాకుండా, 2003 మోడల్ కారు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ 15 ఏళ్ల తర్వాత ముగుస్తుంది. కాబట్టి దానిని రోడ్లపై నడపడానికి అనుమతి ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories