Silver Price: వెండి ధర సరికొత్త రికార్డు.. తొలిసారి రూ.3 లక్షలు దాటిన వెండి

Silver Price: వెండి ధర సరికొత్త రికార్డు..  తొలిసారి రూ.3 లక్షలు దాటిన వెండి
x

Silver Price: వెండి ధర సరికొత్త రికార్డు.. తొలిసారి రూ.3 లక్షలు దాటిన వెండి

Highlights

Silver Price: ఎంసీఎక్స్ మార్కెట్‌లో వెండి ధర తొలిసారిగా కేజీకి రూ.3 లక్షలు దాటింది. ట్రంప్ టారిఫ్ వార్, గ్రీన్‌ల్యాండ్ వివాదమే ప్రధాన కారణం.

Silver Price: దేశీయ కమోడిటీ మార్కెట్‌లో వెండి ధర చరిత్రాత్మక రికార్డును నమోదు చేసింది. సోమవారం (జనవరి 19, 2026) ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో వెండి ధర తొలిసారిగా కేజీకి రూ. 3 లక్షల మార్కును దాటి కొత్త మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో ఈ పెరుగుదల చోటు చేసుకుంది.

ఎంసీఎక్స్‌లో మార్చి 2026 కాంట్రాక్టుకు సంబంధించిన వెండి ధర రూ. 2,93,100 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 3,01,315 స్థాయిని తాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధర 4.4 శాతం పెరిగి ఔన్సుకు 93.85 డాలర్లకు చేరుకుంది. ఒక దశలో 94.08 డాలర్ల ఆల్‌టైమ్ హైని నమోదు చేయడం విశేషం.

గ్రీన్‌ల్యాండ్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. గ్రీన్‌ల్యాండ్ కొనుగోలుకు సహకరించని పక్షంలో యూరప్ దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో, యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతోంది. ఈ పరిణామాలతో డాలర్ విలువ, స్టాక్ మార్కెట్లు బలహీనపడగా, పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లారు.

వెండి ధరలపై నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. పారిశ్రామిక అవసరాల వల్ల పెరుగుతున్న డిమాండ్, సరఫరా లోటు ధరలకు మద్దతునిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంసీఎక్స్‌లో వెండి ధర రూ. 2,95,000 పైన స్థిరపడితే, వచ్చే రోజుల్లో రూ. 3,05,000 నుంచి రూ. 3,20,000 వరకు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా వెండి ధర 93 డాలర్ల పైన నిలకడగా కొనసాగితే, త్వరలోనే 95 డాలర్లు, ఆపై 100 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వెండి బుల్లిష్ ట్రెండ్‌లో ఉన్న నేపథ్యంలో, ధరలు తగ్గిన సందర్భాల్లో కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories