NPS Vatsalya Scheme: కేవలం రూ. 250తో మీ బిడ్డను కోటీశ్వరుడిని చేయండి! ఎలాగో చూసేయండి..!

NPS Vatsalya Scheme: తల్లిదండ్రులుగా పిల్లల కోసం ఆస్తులు సంపాదించడం కంటే, వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కల్పించడం చాలా ముఖ్యం.

Ganesh
Published on: 16 Feb 2026 4:27 PM IST
NPS Vatsalya Scheme: కేవలం రూ. 250తో మీ బిడ్డను కోటీశ్వరుడిని చేయండి! ఎలాగో చూసేయండి..!
X

NPS Vatsalya Scheme: తల్లిదండ్రులుగా పిల్లల కోసం ఆస్తులు సంపాదించడం కంటే, వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కల్పించడం చాలా ముఖ్యం. పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం "NPS వాత్సల్య" (NPS Vatsalya) పథకాన్ని తీసుకొచ్చింది. "వాత్సల్య" అంటే కన్నవారి ప్రేమ. ఆ ప్రేమను పెట్టుబడిగా మార్చి, మీ పిల్లల కోసం ఒక భారీ నిధిని ఎలా సిద్ధం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసలు ఏంటి ఈ NPS వాత్సల్య అంటే..

ఇది 18 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లాంగ్ టర్మ్ సేవింగ్స్ ప్లాన్. దీనిని PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) పర్యవేక్షిస్తుంది. కాబట్టి మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. 2025 కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఈ పథకంలో ఎవరు చేరవచ్చు అంటే.. 18 ఏళ్లలోపు ఉన్న భారతీయ పిల్లలు, NRIలు, OCI కార్డు ఉన్నవారు ఎవరైనా ఇందులో చేరవచ్చు. ఇందులో కేవలం రూ.250 తో కూడా మీరు ఖాతాను స్టార్ట్ చేయవచ్చు. ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. కేవలం తల్లిదండ్రులే కాదు, పిల్లల మీద ప్రేమతో బంధువులు, స్నేహితులు కూడా ఈ ఖాతాలోకి డబ్బులు జమ చేయవచ్చు.

మీ డబ్బు ఎక్కడ పెట్టుబడతారంటే..

మీరు పొదుపు చేసే డబ్బు ఊరికే ఉండదు. అది షేర్ మార్కెట్ (Equity), ప్రభుత్వ బాండ్లు, ఇతర సురక్షిత మార్గాల్లో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇలా పెట్టుబడి పెట్టిన మొత్తం సేఫ్‌గా ఉంటుందా అంటే.. కచ్చితంగా సేఫ్‌గా ఉంటుంది. మీ పిల్లల ఎదుగుదలకు అవసరమైనప్పుడు మీరు పెట్టిన పెట్టుబడి నుంచి కొద్ది మొత్తంలో డబ్బు తీసుకోవచ్చు. మీ పిల్లల పేరు మీద ఖాతా తెరిచిన 3 ఏళ్ల తర్వాత ఈ డబ్బులలో కొద్ది మొత్తం తీసుకోవచ్చు. అలాగే మీ పిల్లల ఉన్నత చదువులు, తీవ్రమైన అనారోగ్యం లేదా వైకల్యం సంభవించినప్పుడు మీరు కట్టిన అసలు మొత్తంలో 25% వరకు తీసుకోవచ్చు. మొత్తంగా చూస్తే 18 ఏళ్ల లోపు రెండు సార్లు ఛాన్స్ ఉంటుంది.

పిల్లలకు 18 ఏళ్లు దాటాక ఏమౌతుంది అంటే..

మీ పిలల్లకు 18 ఏళ్లు రాగానే ఈ ఖాతా మేజర్ ఖాతాగా మారుతుంది. అప్పుడు వారికి 3 ఆప్షన్లు ఉంటాయి..

1. సాధారణ NPS ఖాతాగా మార్చుకుని పొదుపును కొనసాగించవచ్చు.

2. ఈ మొత్తం కార్పస్ రూ.8 లక్షల కంటే తక్కువ ఉంటే మొత్తం ఒకేసారి తీసుకోవచ్చు.

3. 80% మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకుని, మిగిలిన 20% తో పెన్షన్ ప్లాన్ (Annuity) తీసుకోవచ్చు.

ఖాతా తెరవడానికి కావాల్సినవి ఇవే..

* పిల్లల వివరాలు: పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (Birth Certificate).

* తల్లిదండ్రుల వివరాలు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా ధృవీకరణ.

* NRI ల కోసం: పిల్లల పేరు మీద ఉన్న NRE/NRO బ్యాంక్ ఖాతా వివరాలు.

చిన్నప్పుడు మనం చేసే చిన్న పొదుపు, మన పిల్లలు పెద్దయ్యాక ఒక పెద్ద అండగా మారుతుంది. NPS వాత్సల్య అనేది కేవలం ఒక స్కీమ్ మాత్రమే కాదు, మీ పిల్లల భవిష్యత్తుకు మీరు ఇచ్చే అత్యుత్తమ బహుమతి. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి అలవాటును అలవర్చడానికి ఇదే సరైన సమయం.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story