Nifty Bank: సరికొత్త చరిత్ర సృష్టించిన నిఫ్టీ బ్యాంక్.. తొలిసారి 60 వేల మార్క్ దాటి రికార్డు!

Nifty Bank: సరికొత్త చరిత్ర సృష్టించిన నిఫ్టీ బ్యాంక్.. తొలిసారి 60 వేల మార్క్ దాటి రికార్డు!
x
Highlights

భారత స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ షేర్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ చరిత్రలో తొలిసారిగా 60,152 పాయింట్ల మార్కును తాకి సరికొత్త చరిత్ర సృష్టించింది. రుణాల వృద్ధి మరియు క్యూ3 ఫలితాల అంచనాలతో యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ షేర్లు భారీ లాభాల్లో పయనిస్తున్నాయి.

భారతీయ స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ షేర్లు సరికొత్త మైలురాయిని అందుకున్నాయి. శుక్రవారం (జనవరి 2) ట్రేడింగ్‌లో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా 60,152 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకి రికార్డు సృష్టించింది. గత ఏడాది డిసెంబర్‌లో నమోదైన రికార్డులను తిరగరాస్తూ బ్యాంకింగ్ రంగం దూసుకుపోతోంది.

నాలుగు రోజుల్లోనే 2 శాతం జంప్!

కేవలం నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం మేర లాభపడటం విశేషం. బ్యాంకులకు రుణాల డిమాండ్ (Credit Demand) పెరగడం, మూడవ త్రైమాసిక (Q3) ఫలితాలు ఆశాజనకంగా ఉండబోతున్నాయనే అంచనాలు మార్కెట్‌కు భారీ బూస్ట్‌నిచ్చాయి. ఐసీఐసీఐ (ICICI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC), ఎస్‌బీఐ (SBI) వంటి దిగ్గజ షేర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించాయి.

లాభాల్లో ‘యెస్ బ్యాంక్’ టాప్..

నేటి ట్రేడింగ్‌లో ప్రైవేట్ రంగ బ్యాంక్ యెస్ బ్యాంక్ (Yes Bank) ఏకంగా 3.7 శాతం లాభపడి రూ. 22.27 వద్ద ట్రేడ్ అయింది. ఇతర బ్యాంకుల్లో:

  • యూనియన్ బ్యాంక్: 2% లాభం
  • ఇండస్ ఇండ్ బ్యాంక్: 1.5% వృద్ధి
  • పీఎన్‌బీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా: 1 శాతానికి పైగా లాభపడ్డాయి.

పెరిగిన రుణాల జోరు.. తగ్గిన మొండి బకాయిలు

డిసెంబర్ 15 నాటికి దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో రుణాల వృద్ధి 12 శాతానికి పెరగడం గమనార్హం. దీనికి తోడు, ఆర్‌బీఐ (RBI) విడుదల చేసిన నివేదిక ప్రకారం బ్యాంకుల్లో మొండి బకాయిలు తగ్గి ఆస్తుల నాణ్యత మెరుగుపడటం ఇన్వెస్టర్లలో భరోసా నింపింది.

నిపుణుల విశ్లేషణ: క్యూ3 ఫలితాలపై ధీమా

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ (JM Financial) బ్యాంకింగ్ రంగంపై పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తాయని, ఆర్‌బీఐ రెపో రేటు కోత ప్రభావం రానున్న రోజుల్లో బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లకు (NIMs) మరింత కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories