Stock Market Crash : స్టాక్ మార్కెట్‌లో మహా ప్రళయం..5 సెకన్లలోనే రూ.9 లక్షల కోట్లు గోవిందా

Stock Market Crash : స్టాక్ మార్కెట్‌లో మహా ప్రళయం..5 సెకన్లలోనే రూ.9 లక్షల కోట్లు గోవిందా
x
Highlights

Stock Market Crash : పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల సోమవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. సెన్సెక్స్ 2301 పాయింట్లు పతనం కాగా, ఇన్వెస్టర్లు నిమిషాల్లోనే రూ. 9 లక్షల కోట్లు నష్టపోయారు.

Stock Market Crash : వారమంతా కష్టపడి సంపాదించుకున్న ఇన్వెస్టర్ల సొమ్ము.. సోమవారం ఉదయం మార్కెట్ మొదలైన కేవలం 5 సెకన్లలోనే ఆవిరైపోయింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో దలాల్ స్ట్రీట్ రక్తసిక్తమైంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ మార్కెట్లు కుప్పకూలాయి. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై సునామీలా విరుచుకుపడటంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.9 లక్షల కోట్లను నష్టపోయారు. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే సెన్సెక్స్, నిఫ్టీలు పాతాళానికి పడిపోవడంతో మదుపరులు బెంబేలెత్తిపోతున్నారు.

సోమవారం (మార్చి 9) ఉదయం మార్కెట్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. ఉదయం 9:20 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 2,301 పాయింట్లు పతనమై 76,617 వద్ద ట్రేడ్ అయింది. అటు నిఫ్టీ కూడా అదే బాటలో పయనిస్తూ 687 పాయింట్లు నష్టపోయి 23,762 స్థాయికి పడిపోయింది. వాస్తవానికి ఈ పతనం గత శుక్రవారం నుంచే మొదలైంది. శుక్రవారం సెన్సెక్స్ 1,097 పాయింట్లు, నిఫ్టీ 315 పాయింట్లు నష్టపోయాయి. కానీ, నేటి పతనం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సెన్సెక్స్ నేడు 77,056 వద్ద ఓపెన్ కాగా, నిమిషాల వ్యవధిలోనే మరింత కనిష్టానికి పడిపోయింది.

టాప్ లూజర్స్ వీరే

మార్కెట్ పతనంలో ప్రధానంగా దిగ్గజ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. బిఎస్ఈ బాస్కెట్ నుంచి ఇండిగో, టాటా స్టీల్, మారుతి సుజుకి, ఎటర్నల్, ఎల్ అండ్ టీ వంటి షేర్లు టాప్ లూజర్లుగా నిలిచాయి. దాదాపు అన్ని రంగాలు (బ్యాంక్, ఆటో, ఎఫ్ఎమ్‌సిజి) నష్టాల్లోనే ఉండగా, ఐటీ రంగం మాత్రం కొంతమేర నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.

ముందున్నది ముసళ్ల పండుగ?

గత వారం చివరి నుంచే మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. శుక్రవారం కేవలం 6 షేర్లు మాత్రమే లాభాల్లో ముగియగా, 24 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నేటి ప్రారంభం చూస్తుంటే మార్కెట్ మరింత పాతాళానికి వెళ్లేలా కనిపిస్తోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు 117 డాలర్లకు చేరడం, యుద్ధం ముదిరితే మరిన్ని ఆంక్షలు వస్తాయన్న భయంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఈ అనిశ్చితి కొనసాగితే సామాన్య మదుపరుల ఆస్తులు మరింత కరిగిపోయే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories