LIC: మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా ఎల్‌ఐసీ నిర్ణయం.. ఐటీ స్టాక్స్‌లో లక్షల కోట్ల పెట్టుబడి వెనుక అసలు కథ ఇదే!

LIC
x

LIC: మార్కెట్ ట్రెండ్‌కు భిన్నంగా ఎల్‌ఐసీ నిర్ణయం.. ఐటీ స్టాక్స్‌లో లక్షల కోట్ల పెట్టుబడి వెనుక అసలు కథ ఇదే!

Highlights

LIC: దేశీయ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు అయిన భారత ప్రభుత్వ బీమా సంస్థ (ఎల్ఐసీ), ప్రస్తుత త్రైమాసికంలో తన పెట్టుబడి వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది.

LIC: దేశీయ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు అయిన భారత ప్రభుత్వ బీమా సంస్థ (ఎల్ఐసీ), ప్రస్తుత త్రైమాసికంలో తన పెట్టుబడి వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. మార్కెట్ వర్గాలన్నీ ఐటీ (సమాచార సాంకేతిక) రంగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న టైంలో, ఎల్‌ఐసీ మాత్రం ఆ రంగంపైనే భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతుంది. ఇదే సమయంలో గత కొంతకాలంగా లాభాల్లో ఉన్న బ్యాంకింగ్, మెటల్స్, పారిశ్రామిక రంగాల నుంచి ఎల్ఐసీ తన పెట్టుబడులను కొంతమేర తగ్గించుకుంది.

ఐటీ రంగంలో భారీ కొనుగోళ్లు

కృత్రిమ మేధ (AI) రాకతో భారత ఐటీ సేవల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే భయంతో చాలామంది ఇన్వెస్టర్లు ఐటీ షేర్లను విక్రయిస్తున్నారు. అయితే ఎల్‌ఐసీ మాత్రం దీనిని ఒక అవకాశంగా భావించి ఐటీ కంపెనీల వాటాలను భారీగా పెంచుకుంది. ఇప్పటికే ఎల్ఐసీ టి.సి.ఎస్ లో సుమారు రూ. 3,136 కోట్ల, హెచ్.సి.ఎల్ టెక్‌లో దాదాపు రూ. 2,293 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అలాగే కోఫోర్జ్ సంస్థలో ఎల్‌ఐసీ తన వాటాను 1 శాతం నుంచి ఏకంగా 4.66 శాతానికి పెంచుకుంది. తాజా కొనుగోళ్లతో ఎల్‌ఐసీ పోర్ట్‌ఫోలియోలో టెక్నాలజీ రంగం వాటా రూ. 1.82 లక్షల కోట్ల నుంచి రూ.2.17 లక్షల కోట్లకు చేరింది.

ఇదే సమయంలో ఈ బీమా దిగ్గజం ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో తన వాటాలను తగ్గించుకుంది. ఎస్‌బీఐలో అత్యధికంగా రూ. 3,080 కోట్ల విలువైన వాటాలను విక్రయించింది, అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకుల షేర్లను కూడా కొంతమేర విక్రయించింది. ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకి వంటి దిగ్గజ సంస్థలలో కంపెనీల పెట్టుబడులను తగ్గించుకుంది. హిందాల్కో, వేదాంత, సెయిల్ వంటి కంపెనీల్లోనూ షేర్లను విక్రయించింది.

ఐటీ తర్వాత ఎల్‌ఐసీ అత్యధికంగా పెట్టుబడి పెట్టింది సన్ ఫార్మాలోనే. ఈ ఫార్మా దిగ్గజంలో రూ. 2,942 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు ఎల్ఐసీ కొనుగోలు చేసింది. వీటితో పాటు బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఎన్‌ఎండిసి వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ తన పెట్టుబడిని పెంచుకుంది. ఎల్‌ఐసీ ఈ త్రైమాసికంలో మొత్తం 73 కంపెనీల్లో వాటాలను పెంచుకోగా, 90 కంపెనీల్లో తగ్గించుకుంది. ఐటీ షేర్లు వాటి గరిష్ట స్థాయిల నుంచి 30 శాతం వరకు పడిపోయినప్పటికీ ఎల్‌ఐసీ కొనుగోలు చేయడం చూస్తుంటే.. స్వల్పకాలిక ఒడిదుడుకుల కంటే దీర్ఘకాలిక వృద్ధిపైనే ఆ సంస్థ నమ్మకంగా ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధోరణికి భిన్నంగా ఎల్‌ఐసీ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories