Amazon: అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు!

Layoffs Have Begun at Amazon
x

Amazon: అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు!

Highlights

Amazon: కొనసాగుతున్న తొలగింపుల పర్వం

Amazon: టెక్‌ సెక్టార్‌లో తీవ్ర అలజడి మొదలయ్యింది. ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. తాజాగా ఉద్యోగులను తీసేస్తున్నట్టు ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ అమెజాన్‌ ప్రకటించింది. ఏకంగా 10వేల ఉద్యోగాలను తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తున్నా.. అమెజాన్‌ చరిత్రలోనే అత్యధికంగా ఉద్యోగులపై వేటు వేయడం ఇదే తొలిసారి. ప్రధానంగా అలెక్సా వంటి డివైజ్‌, రిటైల్‌, హెచ్‌ఆర్‌ విభాగాల్లో కోతలు విధిస్తున్నట్టు తెలుస్తోంది. కార్పొరేట్‌ విభాగంలో కోతలు విధిస్తున్నట్టు అమెజాన్‌ గత నెలలోనే ప్రకటించినప్పటికీ.. రిటైల్‌ బిజినెస్‌, డివైజ్‌ మేకింగ్‌ విభాగాల్లోనూ తొలగింపులు ఉంటాయని మాత్రం ఎవరూ అంచనా వేయలేదు. మాంద్యం భయం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణమే తాజా తొలగింపులకు కారణం. తొలగింపుల ప్రక్రియ అమెజాన్‌తో ఆగదని.. మరిన్ని కంపెనీలు అదే దిశగా అడుగులు వేస్తూ.. ఉద్యోగుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం వస్తుందన్న అనుమానం.. టెక్‌ సెక్టార్‌ను భయాందోళనకు గురిచేస్తోంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం గుబులు పుట్టిస్తున్నాయి. పలు కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి. ట్విట్టర్‌తో మొదలైన ఈ ఉద్యోగుల కోత సెగ... తాజాగా అమెజాన్‌కు తాకింది. 10 వేల మందిని తొలగిస్తున్నట్టు అమెజాన్‌ తాజాగా ప్రకటించింది. ఈ సంఖ్య తక్కువే అయినా.. అమెజాన్‌ చరిత్రలోనే 10వేల మందిని తొలగించడం ఇదే తొలిసారి. భారీగా వేర్‌హౌస్‌లు, పలు ప్రయోగాత్మక ప్రాజెక్టులు, టెలీహెల్త్‌ సర్వీసులను ఈకామర్స్‌ దిగ్గజ సంస్థ మూసివేస్తోంది. అయితే వ్యయాలను ఎందుకు తగ్గించుకుంటోందన్న దానికి.. అమెజాన్‌ హెచ్‌ఆర్‌ చీఫ్‌ బెత్‌ జెలేటీ జారీ చేసిన అంతర్గత ఉత్తర్వులు సమాధానం చెబుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం లోపించిందని.. అందుకే నియామకాలు, పెట్టుబడులను సమం చేసేందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక అనిశ్చితిపైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్‌ సైతం ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక మాంద్యం వస్తే.. ఏం చేస్తారన్నదానికి.. బెజోస్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. ఆర్థిక వ్యవస్థ ఏమంత బాగా లేదని స్పష్టం చేశారు. పరిస్థితులు నెమ్మదించాయన్నారు. పలు కంపెనీలు ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నట్టు వివరించారు. ప్రజలు కొంత రిస్క్‌ తీసుకోవాలని.. కొనుగోళ్లు ఆపేయాలన్నారు. వీలైనంత వరకు డబ్బును ఆదా చేసుకోవాలని బేజోస్‌ పిలుపునిచ్చారు. బేజోస్‌ సలహాను అమెజాన్‌ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే.. బేజోస్‌ సలహాను అమెజాన్‌ మాత్రమే సీరియస్‌గా తీసుకోలేదు. పలు టెక్‌ కంపెనీలు కూడా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళన చెందుతున్నాయి. కీలకమైన కంపెనీలు భారీగా ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్నాయి. ఇటీవల ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌.. మైక్రో బ్లాగింగ్‌ సంస్థలో సగం ఉద్యోగులను తొలగించారు. మార్క్‌ జూకర్‌ బర్గ్‌కు చెందిన మెటా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్‌లో 11వేల మంది ఉద్యోగులను తొలగించారు. వీటితో పాటు లిఫ్ట్‌, స్ట్రైప్‌, స్నాప్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించాయి. గత వారం రోజుల్లోనే ఒక్క సిలికాన్‌ వాలీలోనే 20వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. టెక్‌ సెక్టార్‌లో భారీగా అలజడి రేగుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు ట్రెండ్‌గా మారుతోంది. ఏ కంపెనీ ఏ క్షణంలో తమను తొలగిస్తుందోనని కార్పొరేట్‌ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఉద్యోగుల తొలగింపు ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ఇతర రంగాల్లోనూ ఉద్యోగుల కోతలు ప్రారంభం కానున్నట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే పలు కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగాల తొలగింపు సంకేతాలిస్తున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి చెందిన డిస్నీ ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎంత మందిని తొలగించాలనేదానిపై ఇంకా ఓ అంచనాకు రాలేదని సమాచారం. గత చివరి త్రైమాసికంలో నష్టాలే అందుకు కారణమని డిన్నీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ-సిగరేట్‌ కంపెనీ.. జువుల్‌ లాబ్స్‌ కూడా ఉద్యోగులను తొలగించనున్నది. తీవ్ర నష్టాల్లో మునిగిన జువుల్‌ ల్యాబ్స్‌.. దివాళా నుంచి బయటపడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలోని 30 శాతం మందిని తొలగించనున్నట్టు జువుల్‌ లాబ్స్‌ వర్గాలు చెబుతున్నాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కూడా అదే బాటలో అడుగేస్తున్నది. ఆరోగ్య రంగ దిగ్గజం కంపెనీ అవసరాలకు తగినంత మందిని పెట్టుకుని.. మిగిలిన వారిని తొలగించనున్నట్టు ప్రకటించింది. బార్‌క్లేస్‌ సంస్థలో బ్యాంకింగ్‌, వాణిజ్య విభాగాల్లో 200 మందిని ఇప్పటికే తొలగించింది. సిటీ గ్రూప్‌ 50 మందిని తొలగించినట్టు వార్తలొచ్చాయి. అలాగే గోల్డ్‌మన్‌ సాచ్స్‌, సాప్ట్‌ బ్యాంక్‌, వెల్స్‌ ఫర్గో సంస్థలు కూడా ఉద్యోగులను త్వరలో తీసేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని కంపెనీలు ఇదే బాట పట్టనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకు వస్తున్నట్టు 90 శాతం మంది బిజినెస్‌ లీడర్స్‌ భావిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. సగానికి పైగా కంపెనీల సీఈవోలు వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగాలను తొలగింపునకు సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ ఏడాది అక్టోబరులోనే ఉద్యోగాల కోత ట్రెండ్‌ మొదలయ్యింది.

అక్టోబరులోనే 13 శాతం ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఏకంగా 30వేల మంది ఉద్యోగాలను కోల్పోయినట్టు సర్వేలు చెబుతున్నాయి. 2021 ఫిబ్రవరి తరువాత.. అక్టోబరులోనే అత్యధికంగా ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికన్‌ కంపెనీలు తొలగింపులు చేపడితే.. ఆ ప్రభావం మిగతా ప్రపంచ దేశాలపై తీవ్రంగా చూపుతుంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తప్పదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ క్రమంగా సంక్షోభం దిశగా పయనిస్తోంది. అమెరికా తలసరి ఆదాయం పడిపోతోంది. జనవరి నుంచి మార్చి మధ్యలో 1.6 శాతం ఉన్న తలసరి ఆదాయం.. జులై నాటికి అది కాస్తా.. 0.6 శాతానికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తుందనడానికి.. ఆ దేశ తలసరి ఆదాయమే ఉదాహరణ అంటూ ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అమెరికా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. మార్కెట్ల పతనంతో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటోంది. మాంద్యం ప్రభావం ఇప్పటికే అమెరికన్లపై పడుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు గతేడాది కంటే.. రెట్టింపయ్యాయి. దీంతో లక్షలాది అమెరికన్ల సొంతింటిక కల చెదిరిపోయింది. ఇప్పటికే అమెరికాలో సొంత ఇళ్లు లేనివారి సంఖ్యం రోజు రోజుకు రెట్టింపవుతోంది. వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో తాము ఇళ్లను కొనుగోలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలోని పలు కంపెనీలకు చెందిన ఉద్యోగుల్లో గుబులు మొదలయ్యింది. తాజా ట్రెండ్‌తో లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయి... రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories