Cyber Attack: ఇరాన్ మీద ఇజ్రాయిల్ సైబర్ దాడి.. రూ.800కోట్ల క్రిప్టో బూడిద

Cyber Attack
x

Cyber Attack: ఇరాన్ మీద ఇజ్రాయిల్ సైబర్ దాడి.. రూ.800కోట్ల క్రిప్టో బూడిద

Highlights

Cyber Attack: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉన్న గొడవ ఇప్పుడు కొత్త రూపు తీసుకుంది. అది డిజిటల్ యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోంది.

Cyber Attack: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉన్న గొడవ ఇప్పుడు కొత్త రూపు తీసుకుంది. అది డిజిటల్ యుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో ఆర్థికంగా భారీ నష్టం జరుగుతోంది. 'ప్రిడేటరీ స్పారో' అనే ఇజ్రాయిల్ హ్యాకింగ్ గ్రూప్, ఇరాన్‌లోని అతిపెద్ద క్రిప్టో ఎక్సేంజ్ అయిన నోబిటెక్స్ (Nobitex) నుంచి 90 మిలియన్ డాలర్లు (దాదాపు 800 కోట్ల రూపాయలు) విలువైన క్రిప్టోకరెన్సీని దొంగిలించినట్లు ప్రకటించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హ్యాకర్లు దొంగిలించిన డబ్బును వాడుకోకుండా వాటిని నాశనం చేశారు. క్రిప్టో ప్రపంచంలో దీన్ని 'బర్న్' చేయడం అంటారు. వాళ్ళ ఉద్దేశ్యం డబ్బు సంపాదించడం కాదు.. ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వడం.

ఫార్చ్యూన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ సైబర్ దాడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు జరిగింది. హ్యాకర్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X) లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో నోబిటెక్స్ టెర్రరిజానికి ఆర్థికంగా సహాయం చేస్తోందని, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. దీనికి సమాధానంగా, నోబిటెక్స్ కూడా తన ఎక్స్ అకౌంట్‌లో, తమ క్రిప్టోకరెన్సీలో ఎక్కువ భాగం కోల్డ్ వాలెట్లలో ఉందని, అందుకే దాడి వల్ల దానిపై ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పింది.

క్రిప్టో ఎనలిటిక్స్ సంస్థ ఎలిప్టిక్ చెప్పిన దాని ప్రకారం.. ప్రిడేటరీ స్పారో హ్యాకర్లు బిట్‌కాయిన్, డాగ్‌కాయిన్, మరో 100కు పైగా ఇతర క్రిప్టోకరెన్సీలను దొంగిలించారు. కానీ, వాటన్నిటినీ నాశనం చేశారు. హ్యాకర్లు దొంగిలించిన డబ్బును కొన్ని బ్లాక్‌చెయిన్ అడ్రస్‌లకు పంపించారు. ఆ అడ్రస్‌లలో 'F-iRGCTerrorists' లాంటి పదాలు ఉన్నాయి. ఐఆర్‌జిసి అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది ఇరాన్ సైన్యంలో ఒక విభాగం. ఈ చర్య చాలా స్పష్టంగా ఒక ప్రతీకాత్మక సందేశాన్ని ఇవ్వడానికే చేశారు.

ఎలిప్టిక్ సంస్థలోని ప్రధాన క్రిప్టో థ్రెట్ రిసర్చర్ అర్దా అకార్టునా మాట్లాడుతూ.. ఇలాంటి ప్రత్యేక పదాలున్న చాలా అడ్రస్‌లను సాధారణ కంప్యూటింగ్ పవర్‌తో తయారు చేయడం అసాధ్యమని చెప్పారు. దీనిబట్టి, ఈ హ్యాక్ వెనుక ఉద్దేశ్యం డబ్బు సంపాదించడం కాదు, కేవలం రాజకీయ సందేశం ఇవ్వడమే అని స్పష్టమవుతోంది. ఈ సైబర్ దాడి డిజిటల్ యుద్ధంలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఇజ్రాయిల్ హ్యాకర్లు ఇరాన్‌పై చేసిన ఈ దాడి, ఇరాన్ మార్కెట్‌ను కదిలించివేసింది. ఇది డిజిటల్ వార్‌ను మరింత తీవ్రతరం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories