India Poverty Reduction: 11ఏళ్లలో రికార్డు స్థాయికి పడిపోయిన పేదరికం.. భారత్ పై ప్రపంచ బ్యాంక్ ఆశ్చర్యం

India Poverty Reduction
x

India Poverty Reduction: 11ఏళ్లలో రికార్డు స్థాయికి పడిపోయిన పేదరికం.. భారత్ పై ప్రపంచ బ్యాంక్ ఆశ్చర్యం

Highlights

India Poverty Reduction: గత దశాబ్దంలో భారతదేశంలో పేదరికం అసాధారణ స్థాయిలో తగ్గింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక స్పష్టం చేసింది. భారత్ సాధించిన ఈ విజయాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.

India Poverty Reduction: గత దశాబ్దంలో భారతదేశంలో పేదరికం అసాధారణ స్థాయిలో తగ్గింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక స్పష్టం చేసింది. భారత్ సాధించిన ఈ విజయాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. పేదరికాన్ని తగ్గించడంలో భారత్ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో తీవ్ర పేదరికం రేటు 2011-12లో 27.1శాతం ఉండగా, 2022-23 నాటికి అది కేవలం 5.3%కి తగ్గింది. ఇది కేవలం 11 ఏళ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతి. ప్రపంచ బ్యాంకు 2021 ధరల ప్రకారం రోజుకు మూడు డాలర్లు ($3) ఆదాయాన్ని పేదరిక రేఖగా సవరించింది. అంటే, ఇప్పుడు రోజుకు $3 కంటే తక్కువ సంపాదించేవారు పేదలుగా లెక్కలోకి వస్తారు. ఈ కొత్త లెక్కల ప్రకారం 2024లో భారతదేశంలో 54.4 మిలియన్ల మంది రోజుకు $3 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మార్పులు

నివేదిక ప్రకారం, 2011-12 మరియు 2022-23 మధ్యకాలంలో, తీవ్ర పేదరికం రేటు 16.2% నుంచి 2.3%కి తగ్గింది. ఫలితంగా 171 మిలియన్ల మంది ప్రజలు పేదరిక రేఖకు ఎగువకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 18.4% నుంచి 2.8%కి, పట్టణ ప్రాంతాల్లో 10.7% నుంచి 1.1%కి తగ్గింది. దీంతో గ్రామీణ-పట్టణ పేదరిక వ్యత్యాసం 7.7% నుంచి 1.7%కి తగ్గింది. ఇది సంవత్సరానికి సగటున 16% తగ్గింపును సూచిస్తుంది. ఉచిత ఆహార పంపిణీ, సబ్సిడీ ఆహార బదిలీలు వంటి ప్రభుత్వ పథకాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయని నివేదిక పేర్కొంది. అయితే, దేశంలోని ఐదు అత్యంత జనాభా కలిగిన రాష్ట్రాల్లో అత్యంత పేదలలో 54% మంది నివసిస్తున్నారని కూడా నివేదిక తెలిపింది.

ఆర్థిక రంగంలో స్థితి, భవిష్యత్ సవాళ్లు

ఆర్థిక రంగం విషయానికి వస్తే, 2024-25 నాటికి భారతదేశ వాస్తవ జీడీపీ (GDP) కరోనా మహమ్మారికి ముందు స్థాయి కంటే 5% తక్కువగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదించింది. అయితే, ప్రపంచ ఆర్థిక అనిశ్చితిని క్రమబద్ధంగా పరిష్కరించడం ద్వారా, భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా 2027-28 నాటికి తన పూర్తి సామర్థ్య స్థాయిలకు తిరిగి రాగలదని అంచనా వేసింది. కానీ, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, విధాన మార్పులు ఎగుమతి డిమాండ్‌ను తగ్గించి, పెట్టుబడుల పునరుద్ధరణకు అడ్డంకులు సృష్టించవచ్చని నివేదిక హెచ్చరించింది.

లోటు అంచనాలు, విదేశీ మారక నిల్వలు

నివేదిక ప్రకారం, 2026-28లో కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో దాదాపు 1.2% ఉంటుందని అంచనా. దీనికి మూలధన ప్రవాహం (Capital Inflow) ద్వారా నిధులు అందుతాయి. విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) కూడా జీడీపీలో 16% వద్ద స్థిరంగా ఉంటాయని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గత దశాబ్దంలో భారతదేశం పేదరికాన్ని తగ్గించిందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో పేదరిక నిర్మూలన ప్రయత్నాలకు కూడా ఒక గొప్ప ఉదాహరణ అని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories