Gold Price : పెళ్లిళ్ల సీజన్.. బంగారం ధరల మారథాన్.. ఈరోజు తులం ఎంతంటే ?

పెళ్లిళ్ల సీజన్.. బంగారం ధరల మారథాన్.. ఈరోజు తులం ఎంతంటే ?

CR Reddy
Published on: 20 Feb 2026 6:53 AM IST
Gold Price : పెళ్లిళ్ల సీజన్.. బంగారం ధరల మారథాన్.. ఈరోజు తులం ఎంతంటే ?
X

Gold Price : బంగారం కొనాలనుకునే వారికి వరుసగా రెండో రోజు షాకింగ్ న్యూస్ అందింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం స్వల్పంగా పెరిగిన ధరలు, నేడు (శుక్రవారం) కూడా అదే బాటలో పయనిస్తూ కొనుగోలుదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న వేళ, ఈ ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. అంతర్జాతీయంగా ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు, ఆర్థిక అస్థిరత కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ పెరిగి, దేశీయంగానూ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

మన దగ్గర పసిడి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల ధర సుమారు రూ.1,56,500 వద్ద కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,460 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించడం విశేషం.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,650 ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,58,190 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరలు స్థిరంగా ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ధరలన్నీ కేవలం ప్రాథమిక రేట్లు మాత్రమే. వీటిపై అదనంగా జీఎస్టీ, తరుగు వంటివి కలిపితే ఫైనల్ బిల్లు మరింత భారంగా మారే అవకాశం ఉంది.

వెండి ధరల పరిస్థితి

బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర నేడు రూ.2,70,100 మార్కును తాకింది. నిన్నటి కంటే కిలోపై సుమారు వంద రూపాయల మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో బంగారం ధరలు రూ.1.60 లక్షల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story