Money Saving: భారీ ఆదాయం ఉన్నప్పటికీ.. పొదుపు చేయలేకపోతున్నారా?.. ఈ 5 సంకేతాలు ఉంటే మీరు అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లే..!!

Money Saving: భారీ ఆదాయం ఉన్నప్పటికీ.. పొదుపు చేయలేకపోతున్నారా?.. ఈ 5 సంకేతాలు ఉంటే మీరు అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లే..!!
x
Highlights

Money Saving: భారీ ఆదాయం ఉన్నప్పటికీ.. పొదుపు చేయలేకపోతున్నారా?.. ఈ 5 సంకేతాలు ఉంటే మీరు అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లే..!!

Money Saving: ఈ మధ్యకాలంలో చాలా మంది లోన్ అనే ఉచ్చులో చిక్చుకుంటున్నారు. ముఖ్యంగా EMIలపై కొనుగోళ్లు విపరీతంగా పెరగడం దీనికి ప్రధాన కారణంగా మారుతోంది. బ్యాంక్ ఖాతాలో తగినంత డబ్బు లేకపోయినా, ఇప్పుడే కొనండి – తర్వాత చెల్లించండి అన్న ధోరణితో చాలామంది EMIలపై వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు పెద్ద మొత్తాల్లో క్రెడిట్ కార్డ్ వినియోగం కూడా భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తోంది. వ్యక్తిగత రుణాలు సులభంగా లభిస్తున్న నేపథ్యంలో.. అవి కూడా వ్యక్తిని తెలియకుండానే అప్పుల ఉచ్చులోకి నెట్టే ప్రమాదం పెరిగింది.

ఇటీవలి గణాంకాలు ఈ ఆందోళనకర పరిస్థితిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. CRIF హైమార్క్ విడుదల చేసిన డేటా ప్రకారం.. క్రెడిట్ కార్డ్ బకాయిలపై డిఫాల్ట్ రేటు గణనీయంగా పెరిగింది. మార్చి 2024 నాటికి 90 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లపై డిఫాల్ట్ రేటు 12.5 శాతంగా ఉండగా, మార్చి 2025 నాటికి ఇది 15 శాతానికి చేరుకుంది. ఇది వినియోగదారులు తమ చెల్లింపు సామర్థ్యాన్ని మించి ఖర్చు చేస్తున్నారన్న విషయాన్ని సూచిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్రెడిట్ కార్డ్ వినియోగం తప్పు కాదు. కానీ బిల్లు పూర్తిగా చెల్లించగలిగే సామర్థ్యం లేకుండా అధికంగా ఉపయోగిస్తే, అదే పెద్ద సమస్యగా మారుతుంది.

ఒక వ్యక్తి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాడని సూచించే కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఉంటాయి. అయితే, చాలామంది వీటిని ప్రారంభ దశలో గుర్తించలేరు. అప్పులు తీవ్రమైన స్థాయికి చేరుకున్న తర్వాత మాత్రమే పరిస్థితి చేయి దాటిందని గ్రహిస్తారు. అప్పుల ఉచ్చులో పడుతున్నారని సూచించే ఐదు ప్రధాన సంకేతాల గురించి తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ బిల్లులు:

క్రెడిట్ కార్డ్ బిల్లులు లేదా రుణాలపై కనీస బకాయిలు మాత్రమే చెల్లించడం. ప్రారంభంలో ఇది పెద్ద సమస్యలా అనిపించకపోయినా.. దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కనీస మొత్తం చెల్లించడం వల్ల లేట్ ఫీజులు తప్పవచ్చు కానీ అసలు రుణం తగ్గదు. దాంతో వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వడ్డీ మొత్తం అసలు రుణాన్ని కూడా మించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

పాత రుణాలను తీర్చేందుకు కొత్త రుణాలు :

పాత రుణాలను తీర్చేందుకు కొత్త రుణాలు తీసుకోవడం. అప్పుల్లో చిక్కుకున్నవారు చాలాసార్లు ఒక రుణం తీర్చేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తారు. ఇది మొదట్లో తాత్కాలిక ఉపశమనంలా అనిపించినా, వాస్తవానికి అప్పుల ఊబిని మరింత లోతుగా చేస్తుంది. కాలక్రమంలో EMIల భారం పెరిగి, ఆదాయం, ఖర్చుల మధ్య పెద్ద అంతరం ఏర్పడుతుంది.

అసలు రుణ మొత్తం:

క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నప్పటికీ అసలు రుణ మొత్తం తగ్గకపోవడం. ప్రతినెల EMIలు కట్టినా, ప్రిన్సిపల్ బ్యాలెన్స్‌లో గణనీయమైన తగ్గుదల లేకపోతే, అది అప్పుల ఉచ్చులో చిక్కుకున్నట్టు స్పష్టమైన సూచన. ఎందుకంటే, చెల్లిస్తున్న మొత్తంలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుండటమే దీనికి కారణం.

EMIలకే ఖర్చవడం:

ఆదాయంలో పెద్ద భాగం EMIలకే ఖర్చవడం. ఒక వ్యక్తి తన నెలవారీ ఆదాయంలో అధిక శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగిస్తే, పొదుపులు, పెట్టుబడులకు అవసరమైన డబ్బు మిగలదు. దీని వల్ల భవిష్యత్తు ఆర్థిక భద్రత దెబ్బతింటుంది. అనుకోని ఖర్చులను ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోతుంది.

పొదుపులు లేకపోవడం:

సంవత్సరాల తరబడి ఉద్యోగం చేసినప్పటికీ పొదుపులు లేకపోవడం. అప్పుల ఊబిలో ఉన్న చాలామందికి పొదుపు చేయడానికి అవకాశమే ఉండదు. దీర్ఘకాలంగా పనిచేస్తున్నా.. వారి ఆదాయం ఎక్కువ భాగం అప్పుల తీర్చడానికే ఖర్చవుతుంది. ఫలితంగా వారు సరైన పొదుపులు చేయలేరు, పెట్టుబడులు పెట్టలేరు.

EMIలు, క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు సౌకర్యంగా కనిపించినా, అవి నియంత్రణలో లేకపోతే తీవ్రమైన ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయి. అప్పుల సంకేతాలను ముందుగానే గుర్తించి, ఖర్చులను నియంత్రించడం, చెల్లింపు సామర్థ్యానికి లోబడి మాత్రమే రుణాలను ఉపయోగించడం ఎంతో అవసరం.

Show Full Article
Print Article
Next Story
More Stories