Digital Rupee: ఇకముందు దేశంలో రానున్న డిజిటల్ రూపాయి

Digital Rupee Coming Soon in the Country
x

Digital Rupee: ఇకముందు దేశంలో రానున్న డిజిటల్ రూపాయి

Highlights

Digital Rupee: కాన్సెప్ట్‌ పత్రం విడుదల చేసిన ఆర్‌బీఐ

Digital Rupee: దేశంలో డిజిటల్‌ లావాదేవీలకు మరింత ఊతం లభించనుంది. డిజిటల్‌ రూపాయి విడుదల చేసేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ పేరుతో త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఎపుడు విడుదల చేస్తారనే విషయం మాత్రం నిర్దిష్టంగా వెల్లడించలేదు. డిజిటల్‌ రూపాయికి సంబంధించి ఒక ప్రాథమిక విధాన పత్రం విడుదల చేసింది. ఇందులో డిజిటల్‌ రూపాయి తీరుతెన్నులు, ఉపయోగాల గురించి ప్రస్తావించింది. దీంతో దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. చెల్లింపుల విధానం మరింత మెరుగుపడి నల్లధనం, అక్రమ నగదు లావాదేవీలకూ చెక్‌ పడుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం మన నగదును డిజిటల్‌ రూపంలోకి మార్చుకుని, వినియోగించుకుంటున్నాం. ఈ చెల్లింపులకు బాధ్యత వాణిజ్య బ్యాంకులదయితే, సీబీడీసీ చెల్లింపులకు ఆర్‌బీఐ బాధ్యత వహిస్తుంది. ప్రస్తుత కరెన్సీ నోట్లు, నాణేల నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి, నగదు చెలామణీ తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఈ డిజిటల్ రూపాయిని తీసుకొస్తున్నామని ఆర్ బీఐ తెలిపింది. చెల్లింపుల్లో పోటీ, సామర్థ్యం, వినూత్నత పెంచడానికి, విదేశీ లావాదేవీలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి, క్రిప్టో ఆస్తుల నుంచి సామాన్యులను రక్షించి.. దేశీయ కరెన్సీపై విశ్వాసం పెంచడానికే తెస్తున్నామని రిజర్వు బ్యాంకు తెలిపింది.

పరిమిత లావాదేవీలకే డిజిటల్‌ రూపాయిని ముందు పరిమిత లావాదేవీలకు మాత్రమే అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. అయితే ఆ లావాదేవీలు ఏమిటనే విషయం మాత్రం వెల్లడించలేదు. బహుశా వ్యాపార సంస్థల మధ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా జరిగే హోల్‌సేల్‌ ఆర్థిక లావాదేవీల చెల్లింపులకు మాత్రమే డిజిటల్‌ రూపాయిని అనుమతించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీల మధ్య, నల్లధనానికి దారితీసే చీకటి ఒప్పందాల దందాకు చెక్‌ పడినట్టే.... బహుశా వ్యాపార సంస్థలతోపాటు వ్యాపార సంస్థలతో వ్యక్తిగత వినియోగదారులు జరిపే రిటైల్‌ లావాదేవీల చెల్లింపుల కోసం ఆర్‌బీఐ ప్రత్యేక డిజిటల్‌ రూపాయి తీసుకొస్తుందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

డిజిటల్‌ రూపాయి తీసుకొచ్చినా... ప్రస్తుత కరెన్సీ నోట్ల చలామణికి ఎలాంటి ఢోకా ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. డిజిటల్‌ రూపాయి, ప్రస్తుత కరెన్సీ నోట్లకు అనుబంధ కరెన్సీ తప్ప, వాటిని పూర్తిగా భర్తీ చేసేది కాదని పేర్కొంది. డిజిటల్‌ రూపాయి కరెన్సీని కూడా ఆర్‌బీఐనే విడుదల చేస్తుంది. కాగితం కరెన్సీ నోట్లపై ఉండే గుర్తులే ఈ కరెన్సీపైనా ఉంటాయి. ముందు ప్రయోగాత్మకంగా కొన్ని పరిమిత చెల్లింపులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. తర్వాత అన్ని రకాల చెల్లింపులనూ అనుమతిస్తారు. కాకపోతే ప్రస్తుత కరెన్సీ నోట్లు కాగితం రూపంలో ఉంటే, డిజిటల్‌ రూపాయి నోట్లు డిజిటల్‌ రూపంలో ఉంటాయి. ఈ నోట్ల నంబర్లుగానీ, గుర్తులుగానీ మార్చేందుకు ఏమాత్రం అవకాశం ఉండదు. ఇందుకోసం బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఉపయోగిస్తారు. దీంతో దొంగనోట్ల ముద్రణకూ చెక్‌ పడుతుంది. ప్రజలు కరెన్సీ నోట్లు జేబులో పెట్టుకుని బయటికి వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. స్మార్ట్‌ ఫోన్‌ వాలెట్‌లోనే డిజిటల్‌ రూపాయిలు స్టోర్‌ చేసుకోవచ్చు.

సీబీడీసీలో ఒకటి సాధారణ లేదా రిటైల్‌ అవసరాలకు వినియోగించేదయితే, మరొకటి టోకు అవసరాలకు వినియోగించేలా వర్గీకరిస్తారు. రిటైల్‌ సీబీడీసీని అందరూ ఉపయోగించుకోవచ్చు. టోకు సీబీడీసీని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగిస్తాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 60 కేంద్ర బ్యాంకులు సీబీడీసీపై ఆసక్తి చూపాయని ఆ కాన్సెప్ట్‌ నోట్‌ పేర్కొంది. సీబీడీసీ అనేది కేంద్ర బ్యాంకు జారీ చేసే కరెన్సీ. ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్లలో ఇది కనిపిస్తుంది. అందరు పౌరులు, కంపెనీలు, ప్రభుత్వ ఏజెన్సీలు చట్టబద్ధ చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. వాణిజ్య బ్యాంకుల నగదుతో దీన్ని మార్చుకోవచ్చు. బ్యాంకు ఖాతా అవసరం ఉండదు. నగదు జారీ, లావాదేవీల వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకు ఆదరణ పెరిగింది. అయితే వాటి ద్వారా అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదానికి నిధులు ఇవ్వడం వంటివి చేసే అవకాశం ఉంది. క్రిప్టో వల్ల ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడే ప్రమాదం ఉంది. దేశీయ కరెన్సీ స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుంది. అందుకే సీబీడీసీని అభివృద్ధి చేసి, ప్రజలకు నష్టభయం లేని వర్చువల్‌ కరెన్సీని అందించడమే తమ ఉద్దేశమని ఆర్‌బీఐ కాన్సెప్ట్‌నోట్‌ వివరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories