Cooking Oil Price Hike : సామాన్యుడి వంటింటికి యుద్ధ సెగ.. భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

Cooking Oil Price Hike
x

Cooking Oil Price Hike

Highlights

Cooking Oil Prices Jump by 5% as Global War Crisis Disrupts Supply Chains

Cooking Oil Price Hike : అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు నేరుగా సామాన్యుడి వంటింట్లోకి ప్రవేశించాయి. అమెరికా-ఇరాన్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య గొడవలు, పచ్చని సంసారాల్లో చమురు మంటలు రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం, డాలర్ ముందు రూపాయి నీరసించిపోవడంతో భారతదేశంలో వంట నూనెల ధరలు ఒక్కసారిగా ప్రియమయ్యాయి. గడిచిన వారం రోజుల్లోనే లీటర్ నూనెపై రూ.3 నుంచి రూ.5 వరకు (దాదాపు 5 శాతం) ధర పెరగడం సామాన్యులకు మింగుడుపడటం లేదు.

విదేశీ మార్కెట్లలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల సరుకు రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో యుద్ధ భయం పెరగడంతో, ఓడల యజమానులు రవాణా ఛార్జీలను భారీగా పెంచేశారు. దీనికి తోడు రూపాయి విలువ పడిపోవడంతో విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవడం కంపెనీలకు భారంగా మారింది. ఫలితంగా సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్, బ్లెండెడ్ ఆయిల్స్ ధరలు పైపైకి దూసుకుపోతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అక్కడ క్షిపణులు దూసుకుపోతుంటే, ఇక్కడ నూనె డబ్బాల ధరలు మండిపోతున్నాయి.

భారతదేశంలో వంట నూనెల వాడకం చాలా ఎక్కువ, కానీ దానికి తగ్గట్టుగా మన దేశంలో ఉత్పత్తి లేదు. ఉదాహరణకు సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే.. మన దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సాగు ఉన్నప్పటికీ, అది మన అవసరాలకు సరిపోదు. అందుకే మనం ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా, బల్గేరియా వంటి దేశాల నుంచి నూనెను దిగుమతి చేసుకుంటాము. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇప్పుడు ఇరాన్ సంక్షోభం వెరసి ఈ దేశాల నుంచి వచ్చే నూనె సరఫరాకు బ్రేకులు పడ్డాయి. సరుకు రాక తగ్గడంతో దేశీయ మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయి.

మార్కెట్లో ఈ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. వారం క్రితం వరకు మార్కెట్లో రూ.161 కి లభించిన లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్, ఇప్పుడు రూ.165 కి చేరింది. కేరళలో కూడా ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. కేవలం ఒకే బ్రాండ్ కాకుండా మార్కెట్లో ఉన్న సన్ డ్రాప్, ఫార్చ్యూన్ వంటి అన్ని రకాల నూనెల ధరలు పెరిగాయి. అలాగే సన్‌ఫ్లవర్, రైస్ బ్రాన్ కలిపి తయారు చేసే సఫోలా గోల్డ్ వంటి బ్లెండెడ్ నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో లీటరుపై మరో రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories