Cyber Scam : జీతం పెరుగుతుందని ఆశపడితే..బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం..వెలుగులోకి కొత్త సైబర్ మోసం

Cyber Scam : జీతం పెరుగుతుందని ఆశపడితే..బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం..వెలుగులోకి కొత్త సైబర్ మోసం
x
Highlights

జీతం పెరుగుతుందని ఆశపడితే..బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం..వెలుగులోకి కొత్త సైబర్ మోసం

Cyber Scam : ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా దేశంలో ఒక కొత్త రకమైన సైబర్ మోసం కలకలం రేపుతోంది. 8వ వేతన సంఘం అమలైతే మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసుకోండి అంటూ వస్తున్న వాట్సాప్ మెసేజ్‌ల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మోసపూరిత లింకుల ద్వారా ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మాయం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ దోస్త్ (CyberdostI4C) సోషల్ మీడియా వేదికగా అప్రమత్తం చేసింది.

అసలు ఈ మోసం ఎలా జరుగుతుందంటే.. ఉద్యోగులకు వాట్సాప్‌లో ఒక మెసేజ్ వస్తుంది. అందులో 8వ వేతన సంఘం ప్రకారం మీ రివైజ్డ్ శాలరీని లెక్కించే ఒక కాలిక్యులేటర్ ఉందని నమ్మిస్తారు. దాని కోసం ఒక APK ఫైల్ లింక్‌ను పంపిస్తారు. ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే చాలు, సదరు మొబైల్ ఫోన్ మొత్తం కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును వారు సులభంగా కాజేస్తున్నారు. సుమారు కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే ప్రధానంగా వీరు టార్గెట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రభుత్వం ఎప్పుడూ వాట్సాప్ ద్వారా ఇలాంటి ఫైళ్లను పంపదని గుర్తుంచుకోవాలి. గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం ప్రాణాంతకమని హెచ్చరించింది. జీతం, పెన్షన్ లేదా పే కమిషన్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కేవలం అధికారిక వెబ్‌సైట్ https://8cpc.gov.in/ ను మాత్రమే సందర్శించాలని సూచించింది.

ఇక 8వ వేతన సంఘం ప్రక్రియ విషయానికొస్తే.. ప్రభుత్వం ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలు, ఇతర అంశాలపై వివిధ శాఖలు, యూనియన్లు, పెన్షనర్లు, మేధావుల నుంచి అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. కాబట్టి, వాట్సాప్ మెసేజ్‌లను నమ్మి మోసపోకుండా, అధికారిక మార్గాల ద్వారానే సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories