శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

శివనామస్మరణతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు
x
Highlights

ఆ పరమ శివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాలలో తెలియజేసిన మహా శివరాత్రిని ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్థశినాడు...

ఆ పరమ శివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి. పురాణాలలో తెలియజేసిన మహా శివరాత్రిని ఏటా మాఘమాసం కృష్ణపక్ష చతుర్థశినాడు జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగ రూపంలో దర్శణమిచ్చే పవిత్ర పర్వదిన కాలం. దీంతో ఈ మహాశివరాత్రి పర్వదినాన రోజంతా ఉపవాసం చేసి.. రాత్రి అంతా జాగరణ చేస్తారు భక్తులు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈ రోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగారం చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు జరుపుతారు. అందుచేత ఈ పర్వదినం శివరాత్రిగా పిలవబడుతుంది. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవము గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైలం క్షేత్రంలో జరిగే ఉత్సవమును పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రములో విపులంగా వర్ణించాడు. శైవులు ధరించే విభూతి తయారుచేయటానికి మహా శివరాత్రి పవిత్రమైనదని భావిస్తారు.

కాగా తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో మహాశివుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నిలయమైన శ్రీశైలంలో శివరాత్రి వేడుకల కోసం ఏర్పాట్లు రెండు రోజుల ముందుగానే పూర్తి అయ్యాయి. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు.

తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు డాలర్‌ శేషాద్రి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం తరఫున రాజరాజేశ్వర స్వామి వారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.

అలాగే గుంటూరు జిల్లాలో మరో ప్రసిద్ధ శైవక్షేత్రమైన కోటప్పకొండలో శివరాత్రి వేడుకలుఘనంగా ప్రారంభమయ్యాయి. కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రకాశం జిల్లాలోని తిప్పాయిపాలెంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడిని దర్శించుకుంటున్నారు. అర్చనలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక​పూజలు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories