భక్తజన సంద్రంగా తిరుమల కొండలు.. కనీస సౌకర్యాలు లేక భక్తుల అవస్థలు...

Devotees Rush in Tirumala Tirupati Facing Problems with Lack of Facilities | Live News Today
x

భక్తజన సంద్రంగా తిరుమల కొండలు.. కనీస సౌకర్యాలు లేక భక్తుల అవస్థలు...

Highlights

Tirumala Tirupati: కలియుగ వైకుంఠనాధుడి దర్శనానికి భక్తజనం క్యూ కడుతున్నారు...

Tirumala Tirupati: కలియుగ వైకుంఠనాధుడి దర్శనానికి భక్తజనం క్యూ కడుతున్నారు.. వేసవి సెలవులు, వారంతరాలు కావడంతో ఏడుకొండలపై ఊహించని రీతిలో‌ ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగి పోయింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ భక్తులతో పూర్తిగా నిండి పోవడంతో దాదాపు మూడు కిలో మీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నడక మార్గం గుండా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో అశేష సంఖ్యతో సప్తగిరిలు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. తిరుమలలో ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తుంది.

భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్‌లు వెలుపల క్యూలో వేచి వున్నారు భక్తులు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్‌ కొద్ది భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. భక్తుల రద్దీ నేపథ్యంలో మూడు రోజుల పాటు బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకే టీటీడీ పరిమితం చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం పెద్ద భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. క్యూలైన్స్ వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు వంటి సౌకర్యాలు కూడా టీటీడీ కల్పించక పోవడంతో భక్తులు అవస్ధలు పడాల్సిన పరిస్ధితి నెలకొంటుంది.

స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు గదులు కూడా అందుబాటులో లేవు. గదుల కేటాయింపు కేంద్రాల వద్ద భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఎంత సేపు వేచి ఉన్నా గదులు దొరక్క పోవడంతో చంటి బిడ్డలు, వృద్దులతో రోడ్డు పక్కనే భక్తులు సేద తీరుతున్నారు. ఊహించని స్ధాయిలో భక్తులు కొండకు రావడంతో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది. ఇక సర్వదర్శనం విషయానికి వస్తే దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు మాత్రం అవస్ధలు తప్పడం లేదు..

భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నప్రసాద కేంద్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిధి గృహాలు, వసతి భవనాలు, పిఏసీల వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు. భక్తుల సంఖ్యతో లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద కేంద్రం షాపింగ్ కాంప్లెక్స్ లు పూర్తిగా భక్తులతో నిండి పోయింది. మరోపక్క సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత అంటూ టీటీడీ ప్రకటనలకే పరితమైంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల సంఖ్యను ముందుగానే అంచనా వేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపటాల్సిన టీటీడీ నిర్లక్ష్యం వహిస్తోందని భక్తుల నుండి విమర్శలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories