
టాటా మోటార్స్ బంపర్ ఆఫర్.. ఇకపై సగం ధరకే ఎలక్ట్రిక్ కార్లు
Tata Punch EV : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచేందుకు ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. అదే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ స్కీమ్. దీనినే టెక్నికల్ భాషలో BaaS (Battery as a Service) మోడల్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఎలక్ట్రిక్ కారు ధరలో బ్యాటరీ వాటానే దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటుంది. అందుకే పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఈ భారాన్ని తగ్గించి, సామాన్యుడికి కూడా ఈవీని అందుబాటులోకి తీసుకురావడమే టాటా లక్ష్యం.
ఏమిటి ఈ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ మోడల్?
ఈ కొత్త విధానంలో మీరు కారును కొనేటప్పుడు బ్యాటరీకి సంబంధించిన పూర్తి డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం కారు బాడీకి మాత్రమే ధర చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు కారును ఎన్ని కిలోమీటర్లు నడిపితే, దానికి తగ్గట్టుగా బ్యాటరీ కోసం అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.69 లక్షలుగా ఉంటే, ఈ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో ఆ కారును కేవలం రూ.6.49 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు నడిపే ప్రతి కిలోమీటర్ కి సుమారు రూ.2.60 చొప్పున బ్యాటరీ ఛార్జ్ కింద చెల్లిస్తే సరిపోతుంది. అంటే ప్రారంభంలో కారు ధర భారీగా తగ్గుతుందన్నమాట.
పెట్రోల్, డీజిల్ కార్లకు గట్టి పోటీ
దేశంలో ఏటా దాదాపు 30 లక్షల ప్యాసింజర్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో 10 నుంచి 12 లక్షల రూపాయల సెగ్మెంట్‌దే హవా. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో ఈవీల వాటా తక్కువగా ఉంది. అయితే టాటా తీసుకొస్తున్న ఈ కొత్త మోడల్ ద్వారా మధ్యతరగతి ప్రజలు కూడా ఈవీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. టాటా లెక్కల ప్రకారం ప్రస్తుతం 10 శాతం మంది మాత్రమే ఈవీలను ఎంచుకుంటున్నారు, కానీ ఈ స్కీమ్ ద్వారా ఆ సంఖ్యను 2030 నాటికి 30 శాతానికి పెంచాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాలు, జైపూర్ వంటి నగరాల్లో ఈవీ వినియోగం జాతీయ సగటు కంటే ఎక్కువగా 40 శాతం వరకు ఉండటం విశేషం.
భవిష్యత్తు అంతా ఈవీలదేనా?
ప్రస్తుతం మన దేశంలో సీఎన్జీ కార్ల వాటా 40 శాతానికి పైగా ఉంది. కానీ ఈవీల ధరలు తగ్గితే వినియోగదారులు క్లీన్ ఎనర్జీ వైపు మళ్లుతారని టాటా నమ్ముతోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడటం, బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ వంటి ఆకర్షణీయమైన ఆఫర్లు తోడైతే పెట్రోల్, డీజిల్ కార్ల యుగం ముగియడానికి ఎంతో కాలం పట్టదు. భవిష్యత్తులో టాటా నుంచి రాబోయే ప్రతి మోడల్‌ను కూడా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ ఈవీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశమని చెప్పాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




