
మేడ్ ఇన్ ఇండియా పవర్..మన కార్ల కోసం క్యూ కడుతున్న విదేశీయులు
Made in India Cars : ప్రపంచ మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా కార్ల హవా నడుస్తోంది. భారతీయ ఆటోమొబైల్ రంగం 2026 ఏడాదిని అదిరిపోయే రికార్డుతో ప్రారంభించింది. విదేశీయులు మన దేశంలో తయారైన కార్లను కొనేందుకు క్యూ కడుతున్నారు. దీనివల్ల కార్ల ఎగుమతుల్లో ఏకంగా 33.4 శాతం భారీ వృద్ధి నమోదైంది. కేవలం కార్లే కాదు, యుటిలిటీ వెహికల్స్, పికప్ ట్రక్కులకు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ పెరిగింది.
భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2026 జనవరి నెలలో భారత్ నుంచి మొత్తం 76,822 వాహనాలు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది (2025) ఇదే సమయంలో ఈ సంఖ్య కేవలం 57,585 మాత్రమే. అంటే ఏడాది కాలంలో ఎగుమతులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్యాసింజర్ కార్ల విభాగంలో 43.6 శాతం వృద్ధి కనిపించడం విశేషం. మన దేశం నుండి విదేశాలకు వెళ్తున్న కార్లలో టయోటా, మారుతి సుజుకి, మహీంద్రా కంపెనీల వాహనాలు టాప్ లిస్టులో ఉన్నాయి.
విదేశీయులకు మన ఊరి కార్లు బాగా నచ్చేశాయి. గత డిసెంబర్ నెలలో టయోటా హైరైడర్ 5,164 యూనిట్ల ఎగుమతులతో నంబర్-1 స్థానంలో నిలిచింది. దీని తర్వాత మారుతి జిమ్నీ (4,592 యూనిట్లు) తన క్రేజ్‌ను చాటుకుంది. మారుతి నుంచి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ కార్ ఈ-విటారా, స్టైలిష్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ కూడా విదేశీ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. అలాగే మహీంద్రా XUV 3XO ఎగుమతులు కూడా గత ఏడాది కంటే మెరుగ్గా ఉన్నాయి. చిన్న కార్ల నుంచి భారీ ఎస్‌యూవీల వరకు భారత్ ఇప్పుడు గ్లోబల్ హబ్‌గా మారుతోంది.
భారత ఆటోమొబైల్ చరిత్రలోనే ఒక అతిపెద్ద ఎగుమతి ఆర్డర్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా దక్కించుకుంది. ఇండోనేషియా ప్రభుత్వ రంగానికి చెందిన ఒక సంస్థ నుంచి ఏకంగా 35,000 పికప్ ట్రక్కుల కోసం ఆర్డర్ వచ్చింది. మహీంద్రా స్కోర్పియో పికప్ (సింగిల్ క్యాబ్) మోడల్‌కు అక్కడ భారీ డిమాండ్ ఉండటంతో 2026 ఏడాది పొడవునా ఈ వాహనాలను భారత్ నుంచి పంపించనున్నారు. ఇది మన దేశ ఉత్పాదక సామర్థ్యానికి దక్కిన గొప్ప గౌరవంగా నిపుణులు భావిస్తున్నారు.
అన్ని విభాగాల్లో ఎగుమతులు పెరిగినా, వ్యాన్ల విభాగంలో మాత్రం స్వల్పంగా 5.8 శాతం తగ్గుదల కనిపించింది. గత ఏడాది జనవరిలో 1,138 వ్యాన్లు ఎగుమతి అవ్వగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,072కు పరిమితమైంది. అయితే ప్యాసింజర్ వాహనాలు, యుటిలిటీ వాహనాల జోరు ముందు ఈ తగ్గుదల పెద్దగా ప్రభావం చూపలేదు. భారత ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం అనుసరిస్తున్న హై-టెక్ తయారీ విధానం, క్వాలిటీ ప్రమాణాలు విదేశీ కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




