ఆటోలో ఉన్నవాళ్ళంతా దిగండి : ఎమ్మెల్యే రజిని ఫైర్

ఆటోలో ఉన్నవాళ్ళంతా దిగండి : ఎమ్మెల్యే రజిని ఫైర్
x
Highlights

ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మరోసారి వార్తలో నిలిచారు.

ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మరోసారి వార్తలో నిలిచారు. మ‌హిళ‌లు ఆటోలో నిర్ల‌క్ష్యంగా ప్రయాణిస్తుండటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ఆటోలో 18 మంది ఆడవాళ్లు ఎక్కడాన్ని ఆమె తప్పుబట్టారు. రోడ్డుపై ఆటోను ఆపి మరి మహిళలకు క్లాస్ తీసుకున్నారు. అటులో లెక్కకు మించి ఎక్కితే ప్రమాదాలు కొని తెచ్చుకోవడమే అని హెచ్చరించారు. ఈ ఘటన చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణం శివారులో బుధ‌వారం జరిగింది. సాయంత్రం చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని నాదెండ్ల మండ‌లం అప్పాపురం గ్రామంలో ఓ కార్య‌క్ర‌మం ముగించుకుని చిల‌క‌లూరిపేట వైపు వెళుతున్నారు. పోలిరెడ్డిపాలెం దాట‌గానే చిల‌క‌లూరిపేట ప‌ట్ట‌ణం శివారులో ఒక ఆటో నిండుగా ప్ర‌యాణిస్తుండ‌టాన్ని గ‌మ‌నించారు. వెంట‌నే కారు ఆపి ఆటో వ‌ద్ద‌కు వెళ్లి నిలిపేశారు.

ఆటోలో ఎంత‌మంది ఉన్నారో అంద‌రూ కిందికి దిగాల‌ని సూచించారు. అంద‌రూ బ‌య‌ట‌కువ‌చ్చారు. లెక్కేసి చూస్తే అందులో మొత్తం 18 మంది ఉన్నారు. పైగా అందరూ మ‌హిళ‌లే.. దాంతో ఎమ్మెల్యే రజిని ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఐదుగురు ప్ర‌యాణించాల్సిన ఆటోలో 18 మందిని ఎక్కించుకోవడం ఏంట‌ని డ్రైవ‌ర్‌ను ప్ర‌శ్నించారు. డ్రైవ‌ర్ మాత్రం అంతమందిని ఎక్కించుకోపోతే గిట్టుబాటు కాదు అన్నట్టు పేస్ పెట్టాడు. మ‌హిళ‌ల‌తో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలా ప్ర‌యాణించ‌డం ఏ మాత్రం సుర‌క్షితం కాద‌ని, అంతమంది ఎక్కితే ప్రమాదాలు కోరి తెచ్చుకోవడమే అని హెచ్చరించారు.

అంతేకాదు మీ కోసం మీ ఇంట్లో మీ బిడ్డ‌లు ఎదురుచూస్తూ ఉంటార‌ని, మీపైనే ఆధార‌ప‌డి మీ కుటుంబం ఉంద‌ని ఇలా ప్రాణాల‌తో చెల‌గాటం ఆడేలా ప్ర‌యాణాలు చేస్తే నష్టపోయేది మీ కుటుంబాలే అంటూ వారికి చెప్పారు. కీడు ఘ‌డియ‌లు వెంటాడుతూ ఉంటాయ‌ని, ఏదైనా జ‌ర‌గ‌రానిది జ‌రిగితే ఎవరూ బాధ్య‌త వహించారని అన్నారు. అస‌లే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని, సుర‌క్షితంగా ప్ర‌యాణాలు ఉండాల‌ని చెప్పారు. ఆటోకు ప‌రిమితికి మించి ప్ర‌యాణాలు ఎక్కించ‌కుండా చూడాల‌ని అక్క‌డే ఉన్న పోలీసుల‌ను ఆదేశించారు. ప్ర‌తి ఆటోకు కాపలా ఉండాలంటే సాధ్యం కాద‌ని, జ‌నాల్లో మార్పు రావాల‌ని సూచించారు. ఇంకోసారి అంతమందిని ఎక్కించుకోకుండా ఉండాలని డ్రైవర్ కు సూచన చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు రజిని.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories