పాజిటివ్ ఆలోచనలతో పనిచేయండి : సీఎం చంద్రబాబు

అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దని సచివాలయంలో జరుగుతున్న హెచ్ఓడీలు, కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

Siramdasu Nagarjuna
Updated on: 10 Dec 2025 12:30 PM IST
పాజిటివ్ ఆలోచనలతో పనిచేయండి : సీఎం చంద్రబాబు
X

అమరావతి: సచివాలయంలో జరుగుతున్న హెచ్ఓడీలు, కార్యదర్శుల సదస్సులో వారిని ప్రేరేపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయవద్దన్నారు. ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పనిచేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్దతిని విడనాడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఆదేశం ఇచ్చినా సానుకూలంగా తీసుకుని దాన్ని అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలో అధికారి అయినా పాజిటివ్ ఆలోచనలతో పనిచేయాలని అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘చాలా మంది అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తారు. మంచి ఫలితాలు చూపిస్తారు. అయితే, వారి వ్యవహార శైలి, అనుసరించే విధానం కూడా బాగుండాలి. ప్రజలు, అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించే విధానాన్ని అలవర్చుకోవాలి. ఎంత మంచి ఫలితం సాధించినా, .ఆ అధికారి ప్రవర్తన కూడా కూడా ముఖ్యమే” అని సీఎం అన్నారు. “ప్రభుత్వంలో అనేక శాఖల్లో 18 నెలల్లో చాలా మార్పులు తెచ్చాం. అయితే, దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉంది. ఈ రెండు శాఖలు ఇంకా పికప్ అవ్వాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు తెచ్చాం. ఆ తరహా మార్పులు దేవాదాయ శాఖలోని ప్రతి దేవాలయంలో రావాలి. ప్రభుత్వ శాఖల్లో ప్రతి సేవ ఆన్ లైన్‌లో పొందే పరిస్థితి రావాలి. అన్ని సేవలు ఆన్ లైన్‌లో రావడానికి జనవరి 15 డెడ్ లైన్. దానికి అవసరమైన కసరత్తు పూర్తి చేసి ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంచాలి”అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

గత పాలకులు రాష్ట్ర బ్రాండ్ పడిపోయేలా చేశారు

‘‘గత పాలకులు రాష్ట్ర బ్రాండ్ పడిపోయేలా చేశారు. దాని కారణంగా ఎక్కువ వడ్డీలకు అప్పులు చేశారు. 11-13 శాతం వరకు వడ్డీలతో అప్పులు చేశారు. ఇప్పుడు మొత్తంగా ఉన్న అప్పును రీ-షెడ్యూలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. వివిధ కార్పోరేషన్లను కూడా రీ-స్ట్రక్చరింగ్ చేయాలి. ఆడిట్ చేయని విభాగాలన్నింటినీ ఆడిట్ చేయాల్సిందే. చాలా విభాగాలు నిధులు ఎలా ఖర్చు చేశాయో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి.’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story