మార్కాపురంలో గెలుపెవరిది..?

మార్కాపురంలో గెలుపెవరిది..?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరిగిన ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరిగాయి. 5 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నా.. గెలుపు మాత్రం మూడు పార్టీల మధ్యే ఉంది. ఎన్నికలకు...

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరిగిన ఎన్నికలు చాలా ఆసక్తికరంగా జరిగాయి. 5 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నా.. గెలుపు మాత్రం మూడు పార్టీల మధ్యే ఉంది. ఎన్నికలకు ముందే చాలా సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. అయితే పసుపు కుంకుమ, పెన్షన్లు, నిరుద్యోగభృతి మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకువస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా చెప్పవచ్చు. అయితే వైసీపీ ఆవిర్భవించిన తరువాత ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకునంతా వైసీపీ లాగేసింది. గతఎన్నికల్లో వైసీపీ నుంచి జంకే వెంకటరెడ్డి గెలుపొందారు. ఈసారి ఆయనకు టిక్కెట్ దక్కలేదు.

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుందూరు పెద్ద కొండారెడ్డి కుమారుడు నాగార్జునరెడ్డి వైసీపీ తరుపున పోటీ చేశారు. యువకుడు, విద్యావంతుడైన నాగార్జునరెడ్డి టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది. కెపి కొండారెడ్డికి గతంలో కొనసాగిన క్యాడర్ మొత్తం నాగార్జునరెడ్డికి మళ్లింది. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, నాగార్జునరెడ్డికి మామ అవుతారు. పొదిలి మండలంలో శ్రీనివాసరెడ్డికి మంచి పట్టు ఉంది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మొదట్లో బెట్టు చేసిన చివరకు నాగార్జునరెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు పలికారు. పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయిని అయిన వెలిగొండ ప్రాజెక్టు పనుల విషయంలో అప్పట్లో కెపి కొండారెడ్డి చురుకుగా వ్యవహరించారు. ఇప్పుడా ఇమేజ్ తనకు కలిసి వస్తుందని నాగార్జునరెడ్డి నమ్మకం పెట్టుకున్నారు. పైగా జగన్ అధికారంలోకి వస్తేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఇక ఈ నియోజకవర్గంలో జగన్ చరిష్మా బలంగా ఉంది. వైసీపీ నవరత్నాలు బాగా ప్రజల్లోకి వెళ్లాయని నాగార్జునరెడ్డి భావిస్తున్నారు. ఈ కారణాలతో తాను గెలుస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు నాగార్జునరెడ్డి.

మరోవైపు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పోటీ చేశారు. టీడీపీ ప్రకటించిన సంక్షేమ పధకాలు ముఖ్యంగా పింఛన్ల పెంపు, పసుపుకుంకుమ, నిరుద్యోగభృతి బాగా ప్రజలోకి వెళ్లాయి. నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా శిద్దా రాఘవరావు పోటీ చేయడం తనకు కలిసివచ్చే అంశమని అంటున్నారు. మార్కాపురం అర్బన్ లో వైశ్యసామాజిక వర్గం ఓట్లు శిద్దా కారణంగా తనకే పడతాయని నారాయణరెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని చాలా చోట్ల అంతోఇంతో అభివృద్ధి జరిగింది. అయితే ప్రభుత్వ పరంగా ఈ నియోజకవర్గానికి తాగు, సాగునీటి సమస్య తీర్చలేదన్న వాదన ఉంది.

ఇక మరో ప్రధాన పార్టీ జనసేన నుంచి ఇమ్మడి కాశీవిశ్వనాధం పోటీ చేశారు. ఆయన ఎన్నికల ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరారు. ఆయనకు అంతో ఇంతో బలమున్నా గెలిచే అవకాశం మాత్రం జీరో. టీడీపీకి చెందిన కాపు ఓటర్లు జనసేనకు ఓటు వేస్తే టీడీపీకి మైనస్ అయ్యే అవకాశముంది. ఇదే క్రమంలో వైసీపీకి కూడా నష్టమే అయినా.. రెడ్డి, ముస్లిం, ఎస్సి ఓటర్లు వైసీపీవైపే ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మాత్రం ఇక్కడ డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మార్కాపురంలో గెలుపెవరిదో తెలియాలంటే ఈనెల 23 వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories