సంక్రాంతికీ.. కోడిపందాలకు ఏమిటీ లింకు?

సంక్రాంతికీ.. కోడిపందాలకు ఏమిటీ లింకు?
x

కోడి పందాలు ఫైల్ ఫోటో

Highlights

పెద్ద పండగంటే సంక్రాంతి. కొత్త అల్లుళ్లు వస్తారు. సందడి చేస్తారు. మరదళ్లు ఆటపట్టిస్తారు.

చక్కనైన కాంతులతో సిరి సంపదలతో అలరారుతాయి సంక్రాంతి సంబరాలు. అదే సమయంలో అనాది కాలం నుంచి వస్తున్న సంప్రదాయమంటూ కోడి పందాలకు పందెం రాయుళ్లు పరుగులు తీస్తారు. కోడి పుంజుల కోసం లక్షల రూపాయలు ఖర్చుచేస్తారు. పరువు-ప్రతిష్ఠకు మధ్య జరిగే యుద్ధంగా కోడి పందాలు కోస్తాంధ్రలో కోకోల్లలు. అలాంటి కోడి పందాలు ఎలా జరుగుతాయి.? సామాన్యుల నుంచీ మాన్యుల దాకా అందరినీ ఈ కోడిపందాలు ఎందుకింత కట్టిపడేస్తాయి? కోడి పంచాంగం, కోళ్లల్లో రకాలు ఎవరిని, ఎలా పందెం కోసం పాకులాడేలా చేస్తాయి? ఈ అంశాల సమాహారమే ఈ ప్రత్యేక కథనం.

పెద్ద పండగంటే సంక్రాంతి. కొత్త అల్లుళ్లు వస్తారు. సందడి చేస్తారు. మరదళ్లు ఆటపట్టిస్తారు. అందున పల్లెల్లో ఇదీ మరి ఎక్కువ. అదే సమయంలో అలరించే కోడి పందాలు పరువు-ప్రతిష్టల మధ్య నిర్వహిస్తారు. పందెంలో తమ కోళ్లు గెలిచేందుకు నెలా, రెండు నెలల ముందు నుంచే వాటి పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇలా పందేల్లో ఓడి, కోట్ల ఆస్తులను రాత్రికి రాత్రి పోగొట్టుకున్నవారున్నారు. పందెంలో గెలిచి రాత్రికిరాత్రి లక్షలాధికారులైనవారూ ఉన్నారు.

పదునైన ముక్కు... మెడపై సింహం జూలు తలపించే ఈకలు... తలపై కిరీటంలాంటి పింఛం.... తోకలో పోడవైన ఈకలు... ఇవీ సంక్రాంతి నాడు పందెంలో పాల్గొనే కోడిపుంజులకు ఉండే సహజ గుణాలు. ఇలాంటి లక్షణాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. పందానికి అవసరమైన రోషాన్నీ ప్రదర్శిస్తాయి.

సంక్రాంతికీ... కోడిపందాలకు ఏమిటీ లింకు? ఇది ఇప్పటిది కాదు అనాదిగా వస్తున్న సంప్రదాయం. సంక్రాంతి ముందు వరకు కష్టపడి సంపాదించుకున్న పంటలు అప్పుడప్పుడే ఇళ్లకు చేరుతుంటాయి. ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట చేతికొచ్చేసరికి అప్పటి దాకా పడ్డ కష్టం, శ్రమ మరిచిపోయేందుకు కోడిపందాలకు సై అంటారు ప్రజలు.

సంక్రాంతి మూడు రోజులూ పల్లెల్లో కోడిపందాలు చాలా ఖరీదు. పందెం పుంజుల తయారీ పందెం రాయుళ్లకు చాలా ఖర్చుతో కూడికున్నదే. ఒక్కో కోడి పుంజు 4 నుంచి 50 వేల దాకా ధర పలుకుతుంది. ఇంత భారీ మొత్తం వెచ్చించి పందెం కాసేవారు లక్షల్లో సంపాదించుకుంటారు అంతే మొత్తంలో పోగోట్టుకుంటారు. దీనికి చారిత్రక నేపథ్యమూ ఉంది. పల్నాటి యుద్ధం నుంచీ బొబ్బిలి యుద్ధం దాకా అందరినీ అలరించి వినోదాన్ని పంచింది విషాదాన్ని నింపింది.

కోడి పందాల కోసం నిర్వాహకులు చాలా కాలంగా కసరత్తు చేస్తారు. అన్నింటికన్నా కీలకం పందెం కోళ్ల పెంపకం. అసలు పందెంకోడి ఎంపికే పెద్ద పరీక్ష. ఏ జాతికోడికి పుట్టింది...? ఏ రంగులో ఉంది... ? పైచేయి సాధించే కోడేనా? కాదా? వంటివి నిశితంగా పరిశీలిస్తారు. మంచి రకం కోళ్లు ఎక్కడ ఉన్నా... ఖర్చెంతైనా కొనేస్తారు. శారీరక దారుఢ్యం, రంగు వంటి వాటిని గుర్తించటం అందరికీ సాధ్యం కాదు. నైపుణ్యం సంపాదించిన వారే ఆ పని చేస్తారు.

ఆకారం, రంగు, చారలను బట్టి ఒక్కో కోడికి ఒక్కో పేరు ఉంటుంది ఒక్కో ధర ఉంటుంది. ఇలాంటి మొత్తంగా దాదాపు 20 రకాల కోళ్లు ఉన్నాయట. కాకి, డేగ, నెమలి, సేతువా వంటి వాటిని పందానికి తగిన కోళ్లుగా చెప్పుకుంటారు. ఈ పేర్లు కూడా వాటికి సహజసిద్ధంగా వచ్చిన రంగును బట్టి నిర్ధారించినవే. నల్లని ఈకలతో ఉంటే అది కాకి అయితే తెల్లని ఈకలతో కొంగలా ఉండేదాన్ని సేతువా అంటారు ఇక ఎరుపురంగు ఈకలతో ఉండే కోడిని డేగ అని పిలిస్తే వీపుమీదా, రెక్కల మీదా పసుపురంగు బొచ్చు ఉండే పుంజును నెమలి అంటారు.

ఇలా పందెం సమయంలో పుంజులకు రోషం పుట్టుకురావడానికి కారం కూడా పట్టిస్తార. కొన్నిచోట్ల మద్యం కూడా పట్టిస్తారన్నది ప్రచారం. కోడి పందాల నిర్వహణకు తిథి, వార నక్షత్రాలు దిక్కులు కూడా చూస్తారు. ఉదయాన్నే పుంజుకు స్నానం చేయిస్తారు. దినఫలం ప్రకారం మంచిది అని సూచించిన దిక్కు నుంచి బయల్దేరి బరికి చేరుతారు. అంతా ఆ పుంజు చుట్టూ చేరతారు. ప్రత్యర్థి పుంజు ఎక్కడుందో వెదుకుతారు. ఎవరి లెక్కల ప్రకారం వారు విజయావకాశాలపై ఓ అంచనాకు వస్తారు. పందెం ఎంతో నిర్ణయించుకుంటారు. వారి మాటలకు మధ్యవర్తులు సాక్ష్యం. చూడ్డానికి వచ్చిన వారూ పందాలు కాస్తారు. అంతా రణరంగ వాతావరణం.

Show Full Article
Print Article
Next Story
More Stories