రంగుమారిన విశాఖ సాగర తీరం

What Happened in Vishaka Beach | Andhra News
x

రంగుమారిన విశాఖ సాగర తీరం

Highlights

Visakha Beach: నల్లగా మారిన తెల్లని ఇసుకతిన్నెలు

Visakha Beach: విశాఖ సాగరతీరం కలవరానికి గురిచేస్తోంది. నిన్నటి వరకు నల్లటి ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన బీచ్.. ఇప్పుడు అలల ఉధృతితో కోతకు గురవుతోంది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి మండలం శివారు గ్రామం అన్నవరం వరకూ ఉన్న అందమైన తీరాలు తరుచూ కోతకు గురవుతున్నాయి. ఒకప్పుడు నెమ్మదిగా జరిగే బీచ్ కోత, గత కొన్నేళ్లుగా వేగం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తీరానికి రక్షణ కవచాల్లాంటి ఎత్తయిన ఇసుక దిబ్బలు, మడ అడవులు.. మాయం కావడంతో పెను ప్రమాదానికి దారితీస్తోంది. గతేడాది నవంబర్ 14న వరుణ్ చిల్డ్రన్ పార్కు వద్ద బీచ్ భారీగా కోతకు గురై పార్కు మెుత్తం కుంగిపోయింది. 2015లో అలల ఉద్ధృతికి బీచ్ రోడ్డులోని రక్షణ గోడ ఏకంగా 18 మీటర్ల పొడవున కూలిపోయింది. రోడ్డు కూడా దెబ్బతిన్నది. అధికారులు యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించారు. గ్రావెల్, రాళ్లు వేసి తాత్కాలికంగా తీరం కోతకు గురికాకుండా అప్రమత్తమయ్యారు. తీరం కోత అంశంపై పలు రకాల అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. S.O.I.T డెల్టారెస్ అనే విదేశీ సంస్థ దీనిపై కసరత్తు చేస్తున్నా అవి కొలిక్కిరాలేదు.

విశాఖ నుంచి భీమిలి వరకూ ఉన్న తీరం వైవిధ్య భరితంగా ఉంటుంది. ఒక్కోచోట బలమైన సముద్రరాళ్లు తీర ప్రాంతానికి రక్షణగా ఉన్నాయి. మరికొన్నిచోట్ల బలహీనంగా ఉన్నాయి. నీటిబిందువు తగిలితే కరిగిపోయేలా ఉంది. విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల పొడవైన తీరం స్వరూపం రోజురోజుకు మారిపోతోంది. ఆ మార్పుల కారణంగానే ఒక్కోసారి ఒక్కోచోట తీరం కోతకు గురవుతోంది.

వారం రోజులుగా విశాఖ తీరం కోతకు గురవుతోంది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల కోత ప్రభావం కనిపిస్తోంది. విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి.. సన్ రే రిసార్ట్స్‌.. అనే సంస్థ కొన్నేళ్ల క్రితం 600 కొబ్బరి చెట్లను 5 ప్యాచ్‌లుగా బీచ్‌లో నాటింది. ఈ చెట్లు బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు, బీచ్‌లో వివిధ ఆకృతులతో GVMC ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు కూలుతున్నాయి. ఇప్పటి వరకు 25 కొబ్బరి చెట్లు కూలిపోగా మరో 50 కూలేందుకు సిద్దంగా ఉన్నాయి.

విశాఖ తీరంలో నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నప్పటి నుంచి బీచ్ తరచూ కోతకు గురవుతోంది. అయితే వీటిలో అపార్టుమెంట్స్, టూరిజం, హోటల్స్, పోర్టు అవసరాల కోసం జరుపుతున్న నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణాల కారణంగా నగరానికి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కవచంగా నిలిచే కొండలు కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాటిచెట్లు, మడ అడవులు వంటివి లేకపోవడం వల్ల బీచ్ కోత... రోజు రోజుకూ పెరిగిపోతోందని, తీరం సమీపంలో నిర్మాణాలు ఆపివేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

ఏదేమైనా విశాఖ బీచ్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని పర్యావరణ వేత్తలు, పర్యాటకులతో పాటు విశాఖ వాసులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories