రైలు ప్రమాదానికి కారణాలేంటి..?.. మానవ తప్పిదమా..? సాంకేతిక లోపమా..?

What Are The Causes Of Train Accident?
x

రైలు ప్రమాదానికి కారణాలేంటి..?.. మానవ తప్పిదమా..? సాంకేతిక లోపమా..?

Highlights

Train Accident: రాయగడ రైలుకు ఎందుకు పంపలేదు..?

Train Accident: పలాస రైలును లైన్ మధ్యలో ఎందుకు నిలిపాల్సి వచ్చింది..?.. ప్రమాదానికి ముందే హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయా..? లేక.. హైటెన్షన్ వైర్లు తెగిపడటంతో పలాస రైలు ఆగిందా..?..? పలాస రైలు ఆగి ఉన్నప్పుడు.. రాయగడ రైలు అదే లైన్‌లోకి ఎలా వచ్చింది..?.. ఆలమండ స్టేషన్ నుంచి సిగ్నల్ అందలేదా..?.. పలాస రైలును నిలిపివేసిన సమాచారం.. రాయగడ రైలుకు ఎందుకు పంపలేదు..?. రైలు ప్రమాదంపై ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమయం సాయంత్రం ఐదు గంటలు. ఉద్యోగం, ఉపాధి, వివిధ పనులపై వచ్చినవారితో రైల్వే స్టేషన్ అంతా కోలాహలంగా ఉంది. ఇంతలోనే పేదలు, ఉద్యోగుల బళ్లుగా పేరొందిన రెండు రైళ్లు వచ్చాయి. అందరూ తమ సీట్లలో కూర్చున్నారు. కొన్ని నిమిషాల తేడాలో ఒకదాని తర్వాత ఒకటి స్టేషన్ నుంచి బయలుదేరాయి. అక్కడి నుంచి గంట సేపు ప్రయాణం బాగానే సాగింది. ఇక గమ్యస్థానానికి ఎంతో సమయం లేదంటూ కొందరు హడావుడిలో ఉన్నారు. ఇంతలోనే ఒక్కసారిగా కుదుపు. భారీ శబ్దం.. కళ్లు తెరిచి చూస్తే హాహాకారాలు.. ఆర్తనాదాలు.. చుట్టూ కారు చీకట్లు. రక్తమోడుతున్న జనం. ఏం జరిగిందో తెలిసేలోపే పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పదుల సంఖ్యలో క్షతగాత్రులు మిగిలారు. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారే... నిరుపేద జీవులే. బాధితుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.

విశాఖ- రాయగడ పాసింజర్ రైలు కంటకాపల్లి సమీపానికి వచ్చే సరికి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. కొన్ని క్షణాల్లోనే అది ఎక్కువై రైలు ఊగిపోయింది. ప్రమాదం జరిగిన రెండు రైళ్లలో సుమారు 1400 మంది వరకు ప్రయాణికులు ఉంటారని అంచనా. ప్రమాదం జరిగిన తర్వాత వీరి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. సెల్ ఫోన్ల లైట్ల సహాయంతో కొందరు బయటకు వచ్చారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎటుచూసినా క్షతగాత్రుల ఆర్తనాదాలే. ప్రమాదంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా గాయపడ్డారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories