Weather Updates: ఏపీకి అల్పపీడన ముప్పు

Heavy Rains in AP
Weather Updates | ఏపీలో మరోమారు అల్పపీడనం వచ్చేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.
Weather Updates | ఏపీలో మరోమారు అల్పపీడనం వచ్చేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. పది రోజుల క్రితం వరకు వరుసగా కురిసిన వర్షాల వల్ల కొంతమేర నష్టం వాటిల్లినా, అధిక శాతం పంటలకు అనుకూలమయ్యాయి. వీటి ఛాయలు తగ్గుముఖం పట్టేసరికి మరోమారు ఏపీకి రేపట్నుంచి అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత పదిహేను రోజులుగా కాస్తున్న ఎండలకు మెట్ట భూముల్లో సాగు చేసిన పంటలన్నీ ఇప్పటికే సాగు నీటి కోసం చూస్తున్నాయి. ఈ సమయంలో వర్షాలు కురిస్తే కొంతమేర రైతులకు ప్రయోజనం ఉంటుందని రైతాంగం అంటోంది.
బిహార్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ భారతదేశంలో కొనసాగుతున్న తూర్పు, పడమర ద్రోణి క్రమేపీ ఉత్తరం వైపునకు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 13న ఆంధ్రా తీరం ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
► ద్రోణులు, ఎండల తీవ్రత ప్రభావంతో కోస్తా, రాయలసీమ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న 48 గంటల్లో అంటే శనివారం, ఆదివారం రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
► రాష్ట్రంలో వేసవిని తలపించే రీతిలో ఎండలు మండుతున్నాయి. వాతావరణ సమతుల్యం లేకపోవడం వల్ల ఎండ వేడిమి, వేడి గాలులు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల పగటి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. విజయవాడ –36.2, తుని– 36.1, గుంటూరు– 33.8, శ్రీకాకుళం– 33.7, చిత్తూరు, నందిగామ, విజయనగరంలలో 33.6, కావలి, రాజమహేంద్రవరంలలో 30.6, ఏలూరు– 30.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.