ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి కటకట

ఏజెన్సీ ప్రాంతంలో తాగునీటి కటకట
x
Highlights

ఒకవైపు కరోనా హైరానా చేస్తున్న నేపథ్యంలో పనుల్లేక ఇళ్లకే పరిమితమైన ఏజెన్సీ వాసులు, మరోవైపు తాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు.

డుంబ్రిగుడ: ఒకవైపు కరోనా హైరానా చేస్తున్న నేపథ్యంలో పనుల్లేక ఇళ్లకే పరిమితమైన ఏజెన్సీ వాసులు, మరోవైపు తాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితం రూ. 2 కోట్లతో నిర్మించిన రక్షితమంచినీటి పథకం అలంకారప్రాయం కాగా, ఉన్న ఆరుబోర్లులో ఐదు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. దీంతో గొంతెండిన ప్రజలు అల్లాడుతున్నా, అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.2 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించారు.

ఏమైందేమోగానీ ఈ పథకం కింద ఏర్పాటు చేసిన కుళాయిల ద్వారా బురదనీరు, అదీ వారంలో ఒకటి రెండు రోజులు మాత్రమే వస్తుండడంతో, ప్రజలు సమస్యను అధికారుల దృష్టికి తెచ్చారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేకపోవడంతో ప్రస్తుతం ఇది దిష్టిబొమ్మలా మిగిలింది. మండల కేంద్రంలో ఆరు మంచినీటి బోర్లు ఏర్పాటు చేసినా, వాటిలో ఐదు పాడై మూలకు చేరాయి. సంబంధిత అధికారులు చొరవ చూపకపోవడంతో దాదాపు 600 మంది గిరిజనం దాహార్తితో అల్లాడిపోతున్నారు.

గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆశ్రమ పాఠశాల బోరు నుంచి నీటిని తెచ్చి అవసరాలను తీర్చుకుంటున్నామని స్థానికులు వాపోతున్నారు. రూ. 2 కోట్లతో నిర్మించిన రక్షితనీటి పథకం, మరో ఆరు బోర్లు ఏర్పాటుచేసిన మండల కేంద్రంలోనే తాగునీటి పరిస్థితి ఇలా ఉంటే ఇక మారుమూల గ్రామాల్లో నీటి కష్టాలు ఇంకెంత దుర్భరంగా ఉన్నాయో స్పష్టమౌతోందని స్థానికులు అంటున్నారు. వేసవి ఎండలు ముదురుతున్న పరిస్థితుల్లో మున్ముందు నీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయని, అధికారులు స్పందించి, ఉన్న పథకం, బోర్లను వినియోగంలోకి తెచ్చి ప్రజల దాహార్తి తీర్చాలని గిరిజనం కోరుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories