హిందూపురంలో జోరందుకున్న నీటి వ్యాపారం

Water business in Hindupuram | Telugu News
x

హిందూపురంలో జోరందుకున్న నీటి వ్యాపారం

Highlights

Hindupuram: శుద్ధజలం పేరుతో రసాయనాలు కలిపి నీటివ్యాపారం

Hindupuram: మండువేసవిలో తాగునీటి అవసరాలను ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. శుద్ధజలంపేరుతో ఫిల్టర్ నీళ్లను అమ్మి సొమ్ముజేసుకుంటున్నారు. శుద్ధజలం పేరుతో రసాయనాలు కలిపిన సాదారణ నీటిని అమ్ముతూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ మాత్రం ప్రమాణాలు పాటించకుండా జోరుగా వ్యాపారం సాగిస్తున్నారు. అక్రమార్కుల ఆగడాలను అరికట్టాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తుండటంతో నీటిశుద్ధి ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నీటివ్యాపారులు హిందూపురం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న తీరుపై హెచ్ ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

శ్రీ సత్య సాయిజిల్లా హిందూపురం పట్టణంలో నీటి వ్యాపారుల అక్రమాలు నానాటికీ హద్దు మీరుతున్నాయి. అనుమతులు లేకున్నా... యథేచ్ఛగా అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిబంధనలను తుంగలోతొక్కి మామూలు నీటిలో రసాయనాలు కలుపుతూ శుద్ధజలం పేరుతో అమ్ముతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నారు. తాగునీటి అవసరాలను తీర్చే క్రమంలో హిందూపురంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇక్కడంతా కెమికల్ వాటర్ నింపి మినరల్ వాటర్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. హిందూపురంలో సుమారు లక్షకు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. పారిశ్రమిక వాడల్లో 50 వేల మంది వరకూ జీవనం సాగిస్తున్నారు. గతంలో పురంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం తో పాటు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పూర్తీస్థాయిలో పట్టణానికి నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ వేసవిలో ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు బరితెగించి ప్రాణాంతకమైన రసాయనాలను కలుపుతూ ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో అమ్మి సొమ్ముజేసుకుంటున్నారు.

మున్సిపల్ ట్రేడ్ లైసెన్సుతో పాటు ఐఎస్ ఐ నిబంధనలతో అనుమతి ఉన్నవి కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాటర్ ప్లాంట్ రెండు వేల లీటర్ల నీటికెపాసిటీ తో అనుమతి పొందినప్పటికీ. నిత్యం పది వేల లీటర్ల వరకూ పట్టణంలో సరఫరా చేస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో వాటర్ ప్లాంట్ నీటి వ్యాపారం ద్వారా సగటున రూ. 50 వేల వరకూ ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలి. పరిశ్రమల శాఖ నుంచి పార్ట్ వన్ లైసెన్స్ పొందాలి అనంతరం బి.ఎస్.ఐ అనుమతులు ఉండాలి. ఐఎస్ఐ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. జిల్లా వుడ్ఇన్స్పెక్టర్ వాటర్ క్వాలిటీ కంట్రోల్ ను పరిశిలించాలి. హిందూపురంలో వాటర్ ప్లాంట్ల ఏర్పాటులో ఇవేవీ కనిపించవు. సాదారణంగా ప్లాంట్ లో రెండు వేల నీరు కెపాసిటీ ఉంటే ఆర్ వో సిస్టం ప్రాసెస్ ద్వారా వెయ్యి లీటర్లు మాత్రమే శుద్ధ జలం వస్తోంది. వెయ్యి లీటర్ల నీరు వృథా అవుతుంది. వ్యాపారులు నీరు వృథా కాకుండా కేవలం ప్లాంట్ టో ఫిల్టర్ మాత్రమే వాడుతున్నారు. అందులోకి టేస్టీ కెమికల్స్ పేరుతో పలు ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతున్నారు. ఫలితంగా రెండు వేల లీటర్ల నీటిని శుద్ధ జలం పేరుతో విక్రయిస్తున్నారు.

వాటర్ ప్లాంట్లలో శుద్ధజలం పేరుతో విక్రయిస్తున్న నీటిలో ప్రాణాంతకమైన రసాయనాలు కలుపుతుండటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కీళ్ల నొప్పులు, చర్మసమస్యలు, థైరాయిడ్ సమస్యతో పాటు కామెర్లు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలు ప్రభుత్వ తాగునీటి పథకాల ద్వారా సరఫరా అయ్యే నీటిని వేడిచేసుకొని చల్లార్చి తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నీటిలో ఫ్లోరైడ్ సహా అన్ని అలాగే ఉండడంతో పాటు రసాయనాలు కలవడంతో కామెర్లు, కీళ్ల వాపులు, థైరాయిడ్ వంట సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రెవెన్యూ అధికారులు విచ్చల విడిగా అనుమతులు మంజూరు చేస్తున్నారని నిబంధనలు పాటించేలా తనిఖీలుచేసి చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, ఫుడ్ ఇన్ స్పెక్టర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో తాగునీటి ప్లాంట్లపై మున్సిపాలిటీకి పూర్తీస్థాయిలో చర్యలు తీసుకునే అధికారాలు లేవని అధికారలు చెబుతున్నారు. రెవెన్యూ అధికారలు దీనిపై దృష్టి సారించాలని మునిసిపల్ అధికారులు అంటున్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న నీటి వ్యాపరులుపై ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హిందూపురం వాసులు కోరుతున్నారు. ఫుడ్ ఇన్స్ పెక్లర్లు, రెవెన్యూ అధికారలు నీటిప్లాంట్లపై దృష్టి సారించాలని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులపై కొరడా ఝులిపించి రసాయన జలంగాకుండా శుద్ధజలం సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories