గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్: సీఎం

గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా విశాఖ రీజియన్: సీఎం
x
Highlights

సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌ చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు.

విశాఖపట్నం: సమగ్ర ప్రణాళికతో విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ను గ్లోబల్ ఎకనమిక్ హబ్‌ చేయడమే లక్ష్యంగా కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, అర్బన్ డెవలప్‌మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు.. ఇలా అన్ని విధాలా విశాఖ రీజియన్ అభివృద్ధి కావాలని నిర్దేశించారు. విశాఖను మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలని, వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూ సేకరణను వివాదాలు లేకుండా జరపాలని అధికారులకు సీఎం సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఇలా 3 ఎకనమిక్ రీజియన్లుగా మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై తొలిసారి విశాఖలో శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో విశాఖ ఎకనమిక్ రీజియన్‌ సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ ఇతర రంగాలకు సంబంధించి 49 ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.

విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వీఈఆర్‌ పరిధిలో విస్తృతంగా ఉన్న వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చని సీఎం తెలిపారు. స్టీల్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, ఫార్మా సిటీ, టూరిజం ఇలా అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు వీఈఆర్‌లో వీలు ఉందన్నారు. అనకాపల్లిలో త్వరలో మెడ్‌టెక్ జోన్-2 ప్రారంభిస్తామని, టాయ్స్ పార్క్‌లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. డిఫెన్స్ తయారీ కంపెనీలను ఆకర్షించాల్సి ఉందన్నారు. రీజియన్‌లోని ఏజెన్సీ ప్రాంతాలను మిగిలిన ప్రాంతాలతో అనుసంధానం చేయాలని, రహదారుల విస్తరణపైనా దృష్టి పెట్టాలన్నారు. ప్రతి 2 నెలలకు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

శాఖల వారీగా యాక్షన్ ప్లాన్

వీఈఆర్ కోసం వాణిజ్య పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పర్యాటకం, ఐ అండ్ ఐ, ఆర్ అండ్ బీ, ఐటీఈ అండ్ సీ, వ్యవసాయం, అటవీ, వైద్యారోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ, విద్యుత్ ఇలా శాఖల వారీగా విడివిడిగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. వీఈఆర్‌ పరిధిలో ప్రస్తుతం చేపట్టిన, నూతనంగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపైనా ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు సమిష్టిగా ముందుకొస్తే ప్రైవేట్ పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ఉత్తరాంధ్రలో వలసలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పారు. అవసరానికి మించి డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించకుండా ఐటీ, ఏఐ సంస్థలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories