రెండో రోజు కొనసాగనున్న ఏజెన్సీ బంద్

రెండో రోజు కొనసాగనున్న ఏజెన్సీ బంద్
x
Second day Visakha Agency Bandh
Highlights

జీవో 3 పునరుద్ధరణలో భాగంగా మన్యంలో చేపట్టిన రెండు రోజుల బంద్ లో భాగంగా మొదటి రోజు బుధవారం బంద్ విజయవంతమయ్యింది.

జీవో 3 పునరుద్ధరణలో భాగంగా మన్యంలో చేపట్టిన రెండు రోజుల బంద్ లో భాగంగా మొదటి రోజు బుధవారం బంద్ విజయవంతమయ్యింది. దీనిలో భాగంగా అన్ని గిరిజన ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు దీనిలో భాగస్వామ్యం వహించాయి. ఆర్టీసీ సర్వీసులను ముందస్తుగానే నిలిపివేయగా, ఒక్క మోటారు సైకిల్ ను సైతం రోడ్ల మీద తిరిగకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ సైతం బంద్ లో పాల్గొని డప్పు వాయించారు. ఇక రెండో రోజుకు సంబంధించి గురువారం యధాతధంగా బంద్ ను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశాయి.

బంద్ కారణం ఇదీ..

జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, సమగ్ర చట్టం చేయాలని కోరుతూ బుధ గురు వారాలలో ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు.

♦ 19వ తేదీన రాష్ట్రంలోని ఐటీడీఏ ల వద్ద మహా ధర్నా చేపట్టాలని గిరిజన జేఏసీ కార్యాచరణ రూపొందించింది.

♦ ఇందులో భాగంగా బుధవారం ఏజెన్సీ బంద్ విజయవంతం అయింది. ఈరోజు (గురు వారం) కూడా ఏజెన్సీలో బందును విజయవంతం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

♦ గత మూడు రోజులుగా ఏజెన్సీ వ్యాప్తంగా బందును విజయవంతం చేయాలని కోరుతూ ఆటోల ద్వారా ప్రచారం కూడా నిర్వహించారు.

♦ ద్విచక్ర వాహనాలను కూడా బంద్ సమయంలో రోడ్లపైకి అనుమతించబోమని ప్రకటించిన నిర్వాహకులు బుధవారం అదేవిధంగా నిలువరించారు. ఈరోజు కూడా ద్విచక్ర వాహనాలు తిరగనివ్వబోమని నిర్వాహకులు ప్రకటించారు.

♦ ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్టీసీ ఏజెన్సీలో బస్సులను నిలిపివేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

♦ జీవో నెంబర్ 3 అమలు చేయాలని కోరుతూ జూన్ 9న చేపట్టిన బంద్ విజయవంతం కావడం, రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రావడంతో తమ హక్కులను కాపాడుకునేందుకు ఆదివాసీలు 48గంటల బంద్ కు, మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా బుధవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది.

♦ ఈనెల 18వ తేదీన గిరిజన సలహా మండలి సమావేశం కానున్నందున ఈ బందు ద్వారా తమ సత్తా చూపించి గిరిజన హక్కుల పై సమగ్ర చట్టం తెచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జేఏసీ భావిస్తోంది.

♦ జీవో నెంబర్ 3/ 2000 సుప్రీం కోర్ట్ ఈ ఏడాది ఏప్రిల్ 22న రద్దు చేసింది. ఇందువల్ల ఏజెన్సీ విద్యాశాఖలో కొత్త నియామకాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

♦ భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన ప్రత్యేక రిజర్వేషన్లు సుప్రీంకోర్టు రద్దు చేయడంతో గిరిజన నిరుద్యోగులు,ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

♦ భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన శతశాతం ఉద్యోగ పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో సుమారు 50 గిరిజన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ముందుకు సాగుతున్నాయి.

♦ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలైతే వంద పోస్టుల లో స్థానిక గిరిజనులకు కేవలం 6 పోస్టులు మాత్రమే కేటాయిస్తారని, ఇందువల్ల షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతరులకు అవకాశం కల్పించి నట్లు అవుతుందని, తద్వారా గిరిజనులు అణిచివేతకు గురవుతారని గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపిస్తోంది.

♦ జీవో నెంబర్ 3 ని రద్దు చేసి రెండు నెలలు కావస్తున్నదని కావున గిరిజన సలహా మండలి లో తీర్మానం చేసి రిజర్వేషన్ సాధనకు గవర్నర్కు సిఫార్సు చేయాలని, బడ్జెట్ సమావేశాలు జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు చట్టబద్ధత కల్పించాలని జేఎసి డిమాండ్ చేస్తుంది.

♦ మంగళవారం నాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గిరిజన ఎమ్మెల్యేలందరూ జీవో నెంబర్ 3 పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

♦ ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ప్రభావం నుంచి కోలుకుంటున్న ఏజెన్సీ వాసులలో వరుసగా బందులు జరగడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories