చిత్తూరు వాసులను పట్టి పీడిస్తున్న వైరల్ ఫీవర్లు

Viral Fevers In Chittoor District
x

చిత్తూరు వాసులను పట్టి పీడిస్తున్న వైరల్ ఫీవర్లు

Highlights

Chittoor: జ్వరాలతో వణుకుతున్న చిత్తూరు వాసులు

Chittoor: ఉమ్మడి చిత్తూరు జిల్లాను డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్లు పట్టి పీడిస్తున్నాయి. మారు మూల పల్లెల నుంచి నగరాల వరకు ఆసుపత్రులు జ్వర పీడితులతో నిండిపోతున్నాయి. జిల్లా ప్రజానీకం జ్వరాలతో వణుకుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పల్లెల్లో జ్వరాలు ముసురుకున్నాయి. చాలా మంది పరీక్షలు చేయించుకోకుండానే చికిత్స తీసుకుంటున్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో ఎక్కువ శాతం డెంగ్యూ లక్షణాలు భయటపడుతున్నాయి. దీంతో జ్వర బాధితులను డెంగ్యూ భయపెడుతోంది. ఇప్పటికే జిల్లాలో 80 వరకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు 80 వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలో 213 డెంగ్యూ.. 4 మలేరియా కేసులు నమోదు కాగా... ప్రస్తుతం జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 80 డెంగ్యూ.. రెండు మలేరియా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. చాలా‌ మంది ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సలు పొందుతుండటంతో కొన్ని కేసులు అధికారికంగా నమోదు కాలేదంటున్నారు నిపుణులు. అక్కడక్కడా డెంగ్యూ బారిన పడి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. సకాలంలో గుర్తించకపోవడం, ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకుంటూ పరీక్షలను ఆలస్యం చేయడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

వర్షాకాలానికి ముందే సీజనల్‌ వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ అన్ని కేటగిరీల సిబ్బందికి మాన్యవల్ ఇచ్చి శిక్షణ ఇచ్చింది. కానీ సమావేశాల ఫలితం కాగితాల్లో రికార్డులకెక్కిందే తప్పా... క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. దీంతో జ్వరాల తీవ్రత ఎక్కువైందన్న విమర్శలు వెలువెత్తాయి. మరోవైపు వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాలలో ఈ సమస్య మరింత జఠిలంగా మారగా... పంచాయతీలకు నిధులు లేక వారు పారిశుధ్యం వైపు కన్నెత్తి చూడటం లేదు. స్ర్పేయింగ్‌, ఫాగింగ్‌ వంటివి రెగ్యులర్ గా చేయడం లేదు.

డెంగ్యూ భయంతో జ్వరాలు వచ్చిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అక్కడ రక్తపరీక్షలు, బెడ్‌ ఛార్జీలు, మందులు అంతా కలిపి రూ.20 వేల నుంచి 30 వేలు ఖర్చవుతోందని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories