చంద్రబాబు, సుజనా చౌదరిపై విరుచుకుపడ్డ విజయసాయి

చంద్రబాబు, సుజనా చౌదరిపై విరుచుకుపడ్డ విజయసాయి
x
Highlights

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు, సుజనా చౌదరిపై విరుచుకుపడ్డారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు, సుజనా చౌదరిపై విరుచుకుపడ్డారు. 'అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని ఎంత సాగదీస్తే భూముల విలువలు అంత పెరుగుతాయనేది చంద్రబాబునాయుడు స్కెచ్ అని ఆరోపించారు. అందుకే గత ఐదేళ్లలో నాలుగు తాత్కాలిక భవనాలను మాత్రమే కట్టారని.. గ్రాఫిక్స్ తోనే కాలం వెళ్లబుచ్చాడు. ఇప్పడు ప్రపంచస్థాయి రాజధానిని తరలిస్తే ఎలా అని పెడబొబ్బలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు.' అని అన్నారు.

అలాగే సుజనా చౌదరిపై కూడా విమర్శలు గుప్పించారు విజయసాయి.. రాజధాని మార్పు అంత తేలిక కాదని సుజనా చౌదరి సణుగుతున్నాడన్నారు. బ్యాంకులకు ఎగ్గొట్టిన 5 వేల కోట్ల సంగతి ముందు తేల్చి, రాజధాని గురించి మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. అమరావతిలో కొన్న 300 ఎకరాలకు పాత ధర కూడా వచ్చే అవకాశం లేదని నిద్ర పట్టడం లేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

కాగా మూడు రాజధానులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. అమరావతిలో రెండు లక్షల కోట్ల ఆస్తిని సృష్టించామని.. దాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి రాజధానిని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని.. సేకరించిన దానిలో 10 వేల ఎకరాలు అమ్మితే సరిపోతుందని సూచించారు.

మరోవైపు సుజనా చౌదరి కూడా అమరావతిని మూడు ముక్కలు చేస్తే కేంద్రం ఊరుకోదని హెచ్చరించారు. కక్ష సాధింపు చర్య దిశగా ప్రభుత్వం వెళుతోందని ఆరోపించారు. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే సమస్యే ఉండదని సుజనా చౌదరి అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చిందని ఆయన తెలిపారు. క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాక ఏమి చెయ్యాలో అది చేస్తామని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories