మిస్టరీగా మారిన విజయవాడ మెడికో సూసైడ్ కేసు

మిస్టరీగా మారిన విజయవాడ మెడికో సూసైడ్ కేసు
x

reprasentational image

Highlights

* ఫ్యాన్‌కు ఉరివేసుకుని దేవి ప్రియాంక‌ ఆత్మహత్య * గుంటూరు కాటూరి మెడికల్‌ కాలేజీలో పీజీ చేస్తున్న ప్రియాంక * ప్రియాంక గదిలోని ఓ డైరీలో సూసైడ్‌ నోట్ లభ్యం

న్యూఇయర్‌కు వెల్‌కమ్‌ చెప్పే వేళ ఆ ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు వాళ్లను విడిచి వెళ్లిపోయింది. కళ్లఎదుటే విగతజీవిగా పడి ఉన్న తమ గారాలపట్టిని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయారు. ఇది చూసిన స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి.

విజయవాడ భవానీపురంలో నివాసముంటున్న నాగబాబు, జయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె దేవి ప్రియాంక. గుంటూరులోని కాటూరి మెడికల్‌ కాలేజీలో ఎండీ - పల్మనాలజీ సెకండియర్‌ చదువుతోంది. రోజూ మాదిరిగానే గురువారం కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చింది. న్యూ‍ఇయర్‌ సందర్భంగా తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్తూ తనను రావాలని కోరారు. అయితే చదువుకోవాలని చెప్పడంతో ఆమెను ఇంటి వద్దనే ఉంచి వెళ్లారు. రాత్రి సమయంలో తిరిగి వచ్చి చూసేసరికి ప్రియాంక ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో హుటాహుటిన ఆమెను కిందకు దించి 108కు సమాచారమిచ్చారు. వారు వచ్చి పరీక్షించి చనిపోయినట్టుగా ధృవీకరించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె ల్యాప్‌టాప్‌, డైరీని పరిశీలించారు. డైరీలో తన చావుకు నవీన్ కారణమంటూ సూసైడ్ నోట్ రాసినట్టు గుర్తించారు. దీంతో ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియాంక సెల్‌‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆమె కాల్‌ డేటాను పరిశీలిస్తున్నారు. మరోవైపు నవీన్‌ ఎవరో తమకు తెలియదని చెబుతున్నారు ప్రియాంక తల్లిదండ్రులు. తమ కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న భవానీపురం పోలీసులు నవీన్‌ ఎవరా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నవీన్‌ను పట్టుకుంటే యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories