Anil Kumar Singhal on TTD Assets: టీటీడీ ఆస్తులు అమ్మబోం.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్

Anil Kumar Singhal on TTD Assets: టీటీడీ ఆస్తులు అమ్మబోం.. ఈవో అనిల్ కుమార్ సింఘాల్
x
AP High Court (File Photo)
Highlights

Anil Kumar Singhal on TTD Assets: ఎటువంటి అవసరాలొచ్చినా భవిషత్తులో తిరుమల, తిరుపతి దేవస్థానంనకు సంబంధించిన ఆస్తులు అమ్మబోమని కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్..

Anil Kumar Singhal on TTD Assets: ఎటువంటి అవసరాలొచ్చినా భవిషత్తులో తిరుమల, తిరుపతి దేవస్థానంనకు సంబంధించిన ఆస్తులు అమ్మబోమని కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే తీర్మానం చేశామని, భవిషత్తులో ఇటువంటి చర్యలుండవని తేల్చి చెప్పారు.

టీటీడీకి చెందిన నిరర్థక, నిరుపయోగ ఆస్తులను విక్రయించాలన్న ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వ సూచనతో విరమించుకున్నామని టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ హైకోర్టుకు నివేదించారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆస్తులను విక్రయించకూడదని తీర్మానం చేశామని తెలిపారు. ఆస్తుల రక్షణ కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశామని వివరించారు. 1974 నుంచి ఇప్పటివరకు విక్రయించిన ఆస్తులతో పాటు, టీటీడీకి చెందిన అన్ని ఆస్తుల వివరాలతో శ్వేతపత్రం ప్రచురించాలని కూడా టీటీడీ తీర్మానించిందన్నారు.

టీటీడీ ఆస్తుల దుర్వినియోగం ఆరోపణలు సత్యదూరమని తెలిపారు. పిటిషనర్‌ ఎలాంటి ఆధారాల్లేకుండానే ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. టీటీడీకి తమిళనాడులో ఉన్న 23 ఆస్తుల వేలానికి టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ బీజేపీ నేత అమర్నాథ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంలో టీటీడీ ఈవో సింఘాల్‌ కౌంటర్‌ దాఖలు చేశారు.

► వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించిన ఆస్తులు ఏ రకంగానూ పనికి వచ్చేవి కావని, గతంలోనూ ఇలాంటి ఆస్తులను విక్రయించారని కౌంటర్‌లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆస్తుల విక్రయ ఆలోచనను విరమించుకున్నామని చెప్పారు.

► ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్‌కు అవకాశం ఇస్తూ ధర్మాసనం తదుపరి విచారణను 24కి వాయిదా వేసింది. అయితే గతంలో టీటీడీ ఆస్తులను అమ్మకం చేసేందుకు పాలకవర్గం నిర్ణయించింది. తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయానికి గాను రెండు బృందాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాల్లో 8 మంది అధికారులను నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల బహిరంగవేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది.అయితే టీటీడీ ఆస్తుల వేలంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. వెంకన్నకు భక్తులు ఇచ్చిన ఆస్తిని నిర్వహించడానికి మాత్రమే హక్కు ఉన్న మీరెలా వేలం వేస్తారని నిలదీశారు. టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories