ఇక టమోటా వంతు... ఒక్కరోజులో ధర రెట్టింపు!

ఇక టమోటా వంతు... ఒక్కరోజులో ధర రెట్టింపు!
x
Highlights

ఓ వైపు ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీరు తెప్పిస్తుంటే.. మరోవైపు టమోటా ధరలు కూడా చలికాలంలో వేడిపుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ కిలోకు రూ. 25 వరకూ...

ఓ వైపు ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీరు తెప్పిస్తుంటే.. మరోవైపు టమోటా ధరలు కూడా చలికాలంలో వేడిపుట్టిస్తున్నాయి. నిన్న మొన్నటివరకూ కిలోకు రూ. 25 వరకూ ధర పలికిన టమోటా, ఇప్పుడు ఏకంగా రూ. 50కి చేరింది. దీంతో ఉల్లి ధరతోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులు ఇప్పుడు టమోటా ధరను కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే టమోటా పంట అత్యధికంగా వచ్చే మదనపల్లి మార్కెట్లో కిలో టమోటా ధర రూ. 48 పలికింది. ఈ ఏడాదిలో ఇంత పెద్దఎత్తున ధర పలకడం ఇది రెండోసారని అంటున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో టమోటా దిగుబడి తగ్గిపోయిందని.. పైగా వచ్చిన టమోటాలు వర్షాల కారణంగా కూలిపోయాయని అందువల్లే రేట్లు పెరిగాయని అంటున్నారు. వర్షాల కారణంగా చెట్టుమీదే కుళ్లిపోయిన టమోటా పంటను కొందరు రైతులు కోయకుండా పొలాల్లోనే వదిలేశారని అన్నారు. వాస్తవానికి మదనపల్లి మార్కెట్ కు రోజూ 300 టన్నుల వరకూ టమోటా వస్తుంటుంది. అయితే విపరీతమైన వర్షాల పుణ్యమాని అది 200 టన్నులకు పడిపోయింది.

అయితే విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి టమోటాకు భారీ డిమాండ్ ఏర్పడటంతో.. ధరలు ఆకాశాన్ని అంటాయని వినియోగదారులు అంటున్నారు. ఈ పెరిగిన ధర ప్రజలకు భారంగా మారినా, టమోటా రైతులకు మాత్రం వరంలా మారింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల క్రితం కిలోకు 25 పైసలు కూడా ధర రాక, రోడ్లపై పారబోశారు. ఇప్పుడు ఖర్చులు పోను ఏకంగా కిలోకు రూ. 40 ఆదాయం వస్తుండటంతో తమ పంట పడిందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories