నేడు సీఎం చంద్రబాబు కన్హా శాంతివనం సందర్శన

హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సందర్శిస్తారు.

Siramdasu Nagarjuna
Published on: 15 Dec 2025 9:20 AM IST
నేడు సీఎం చంద్రబాబు కన్హా శాంతివనం సందర్శన
X

అమరావతి: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సందర్శిస్తారు. జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ఉదయం బయల్దేరి 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకుంటారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీ తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్ , మెడిటేషన్ సెంటర్ సహా యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి తిలకిస్తారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సీఎం సందర్శిస్తారు.

అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళతారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ను ఈ ఆశ్రమంలో ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మానవ వనరుల్ని గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు ఈ ఆశ్రమం అధ్యక్షులు దాజీ నేతృత్వంలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది. కౌశలం పేరిట శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది.

కన్హా శాంతివనంలోని యోగా, మెడిటేషన్, వెల్ నెస్ సెంటర్లతో పాటు సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అనంతరం ఆయన హెలికాప్టర్ లో బయల్దేరి అమరావతికి తిరిగి వస్తారు. మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, 1952 డిసెంబర్ 15న అమరజీవి అయ్యారు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story