
శ్రీవారి పుష్కరిణిలో వెలుగుల జాతర.. 26 నుంచి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
TTD Updates : శ్రీవారి భక్తులకు శుభవార్త. కలియుగ వైకుంఠం తిరుమలలో అత్యంత సుందరమైన, కనువిందు చేసే సాలకట్ల తెప్పోత్సవాలకు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఈ వేడుకలు కన్నుల పండువగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పుష్కరిణిలో తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఆలయ అధికారులతో కలిసి ఆయన భద్రతా ప్రమాణాలను సమీక్షించారు.
ఈ ఐదు రోజుల వేడుకల్లో భాగంగా ఉత్సవ మూర్తులు పుష్కరిణి నీటిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజైన ఫిబ్రవరి 26న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి వారు తెప్పపై విహరిస్తారు. రెండో రోజున రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారు పుష్కరిణిలో భక్తులకు కనువిందు చేస్తారు. ఇక చివరి మూడు రోజులు (ఫిబ్రవరి 28, మార్చి 1, 2) శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు తెప్పపై వైభవంగా విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
ఉత్సవాల క్రమంలో ప్రతిరోజూ తెప్ప ఎన్ని సార్లు తిరుగుతుందో కూడా టీటీడీ వివరించింది. మొదటి మూడు రోజులు (26, 27, 28 తేదీలు) తెప్ప పుష్కరిణిలో మూడు సార్లు చుట్టి వస్తుంది. నాలుగో రోజున ఐదు సార్లు, వేడుకల చివరి రోజైన ఐదో రోజున ఏడు సార్లు మలయప్పస్వామి వారు తెప్పపై విహరిస్తారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై స్వామివారిని చూడటం భక్తులకు ఒక మధుర అనుభూతిని మిగిలిస్తుంది.
అయితే, ఈ తెప్పోత్సవాల కారణంగా తిరుమలలో కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్ర దీపాలంకార సేవను రద్దు చేయగా.. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను, భారీ భద్రతను టీటీడీ ఏర్పాటు చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




