Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 9 రోజుల వైభవోత్సవానికి సర్వం సిద్ధం


Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 9 రోజుల వైభవోత్సవానికి సర్వం సిద్ధం
ఇవాళ్టి నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్న టీటీడీ భారీగా తరలిరానున్న భక్తులు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.. ఇలా 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవ వేడుకలు కన్నుల పండువగా సాగనున్నాయి. దేవదేవుడిని ప్రతి ఒక్కరూ ఆలయంలో కన్నులారా చూసే భాగ్యం తక్కువగా ఉండడంతో.. భక్తులను అనుగ్రహించేందుకు.. స్వయంగా ఆ దేవదేవుడే ఆలయం నుంచి వెలుపలకు వచ్చి భక్తులకు తనివితీరా దర్శన భాగ్యం కల్పించే అపురూపమైన ఉత్సవాలే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమలగిరి రాయుడికి బ్రహ్మ చేసిన ఘనోత్సవాలు సప్తవర్ణ శోభితంగా సాగుతాయి. అసలు బ్రహ్మోత్సవాల అంతరార్థం ఏమిటి..? బ్రహ్మోత్సవంలో దాగి ఉన్న దైవ రహస్యం ఏమిటి..? భక్తజన కోటికి తిరుమలలో ప్రతి రోజు బ్రహోత్సవాలే అయినప్పుడు ఈ ఉత్సవాల నిర్వహణ వెనక ఉన్న వైశిష్ట్యాన్ని తెలుసుకుంటే చాలు.. ఆ స్వామి వైభవం ఏమిటో అర్థమవుతుంది.
ఈ కలియుగ వైకుంఠంగా... ఓ దివ్యక్షేత్రంగా పవిత్ర పుణ్యక్షేత్రంగా యుగ యుగాల నుంచి భాసిల్లుతున్న క్షేత్రం తిరుమల.. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంతంటి పుణ్యస్ధలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు. శ్రీనివాసుడు, తిరుమలేశుడు, ఆపదమొక్కులవాడు సప్తగిరీశుడు, గోవిందుడు ఇలా అనేక పేర్లతో పిలిచే స్వామి..భక్తుల పాలిట కల్పతరువు. భక్తుల కోరిన కోర్కెలు నెరవేర్చే పరంధాముడు.. అందుకే తిరుమలేశుని కోవెలె నిత్య కళ్యాణం పచ్చ తోరణం.. రోజుకు దాదాపు 70 వేల మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే.. అది తిరుమలే… సంవత్సరంలోని 365 రోజులు ఈ క్షేత్రంలో రద్దీ ఉంటూనే ఉంటుంది. దేశం నలుమూలలనుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీనివాస సందర్శన కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటారు.. గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుని అరవింద దళాక్షుడిని తనివి తీరా దర్శించుకుంటారు.. సాధారణ భక్తులే కాదు సంపన్నులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ వేత్తలు క్యూలు కట్టే క్షేత్రం ఏదంటే అది తిరుమలే.అందుకే తిరుమల గిరులు ఎప్పుడూ జన సంద్రమే.. శ్రీవారి దర్శనానికి వచ్చే వారు వస్తుంటే వెళ్లేవారు వెళుతుంటారు. సాధారణ భక్తులు సర్వదర్శనం తో సంతృప్తి చెందితే కొందరు భక్తులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు.. మరికొందరు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సహస్రకళాశాభిషేకం, తోమాల, అర్చనం, అభిషేకం మొదలైన సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఒక్కోక్క సేవలోనూ ఒక్కో దివ్యానుభూతి పొందడం జరుగుతుంది. అందుకే వచ్చినవారే మళ్లీ మళ్లీ వస్తారు. చూసిన కనులే మళ్లీ మళ్లీ ఆ దేవదేవుని దర్శించుకుంటాయి. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్ని సార్లు దర్శించినా తనివితీరదు.
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలకు యుగయుగాల చరిత్ర ఉంది. శ్రీ వైకుంఠాన్ని వదిలి భక్తులను అనుగ్రహించడానికి భూలోకం వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే శ్రీవేంకటేశ్వరుడు. ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటి ఉవ్విళ్లూరుతుంది. స్వామికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలనీ... వైభవంగా జరిగే వేడుకలు కావున... బ్రహ్మోత్సవాలని పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వయుజ మాసంలోని స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణం పూర్తయ్యే విధంగా ప్రతి సంవత్సరం... ఈ ఉత్సవాలు ఘనంగా తిరుమల కొండలపై జరుగుతాయి. ప్రతి మూడవ ఏటా అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మత్సవాలు భాద్రపద మాసంలో... ఒకటి..దసర నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం జరుగుతుంటుంది. అధిక మాసం రాని సందర్భాల్లో నవరాత్రుల సమయంలో ఒకే బ్రహ్మోత్సవం... శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
యుగయుగాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నప్పటికీ.. శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. చక్రవర్తులు, మహరాజులు తమ విజయపరంపరలకు గుర్తుగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాల పేరుతో వైభవంగా ఉత్సవాలను నిర్వహించేవారు. నెలకొకటి చొప్పున ప్రతి ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవని చరిత్ర చెబుతోంది. క్రీ.శ.614లో పల్లవరాణి సమవాయ్ మనవాళ పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి బహుకరించింది. పెరటాసి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేవారు. ఆ తరువాత క్రీ.శ.1254 చైత్ర మాసంలో తెలుగు పల్లవరాజు విజయ గండ గోపాలదేవుడు, క్రీ.శ. 1328 ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్ల పేరుతో త్రిభువన చక్రవర్తి తిరువేంకట యాదవ రాయలు, క్రీ.శ. 1429 ఆశ్వయుజ మాసంలో వీర ప్రతాపదేవరాయలు, క్రీ.శ.1446లో మాసి తిరునాళ్ల పేరుతో హరిహరిరాయలు, క్రీ.శ.1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు... ఉత్సవాలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. క్రీ.శ. 10వ శతాబ్దంలో తిరుమలలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఉత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఉత్సవ విగ్రహంగా వినియోగించేవారు. క్రీ.శ. 1339 నుంచి మలయప్ప కోనలో లభించిన మలయప్ప స్వామిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి...ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి నిత్య కల్యాణోత్సవాలు,ఇతర ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవాల సమయంలో.... రాజులు. చక్రవర్తులు... స్వామికి ధనధాన్యాలు, అగ్రహారాలు, దివ్యాభరణాలు కానుకగా సమర్పించేవారు.
14వ శతాబ్దం వరకూ శ్రీ వేంకటేశ్వరస్వామికి రెండు బ్రహ్మోత్సవాలు జరిగేవి. 15వ శతాబ్దంలో ఏకంగా సంవత్సరంలో ఏడు బ్రహ్మోత్సవాలు కూడా స్వామికి అప్పటి రాజులు నిర్వహించారు. అన్నమాచార్యుల కుమారుడు తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు 2 వేల వరహాలను శ్రీవారి భాండాగారముకు సమర్పించి 13 రోజుల బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా దేవరాయ మహరాయలు.. అల్పిశి బ్రహ్మోత్సవం బుక్కరాయ మహారాయలు కార్తికి బ్రహ్మోత్సవం కృష్ణదేవమహరాయలు. తల్లిదండ్రుల పేరుతో తై బ్రహ్మోత్సవం హరిహరరాయ మహారాయులు మాసి బ్రహ్మోత్సవం, వీరనరసింగ యాదవ రాయలు పుంగుణి బ్రహ్మోత్సవం తాళ్లపాక తిరుమలాచార్యులు ఆని బ్రహ్మోత్సవం ఇలా వివిధ పేర్లతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ విధంగా క్రీ.శ.16వ శతాబ్దంలో శ్రీనివాసునికి 9 నెలల్లో పది బ్రహ్మోత్సవాలు 9రోజుల పాటు, 11 రోజుల పాటు,13 రోజుల పాటు జరుగుతుండేవని చరిత్ర పేర్కొంటోంది. రాయల వారి కాలంలో ప్రతి ఏటా 15 బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. వెంకన్నకు మాన్యాలు సమర్పించి.. దాతలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు.
రాజ్యాలు....కాలగర్భంలో కలసిన పోయినందువల్ల వారి పేరుతో జరిగిన ఉత్సవాలు ఆ తరువాతి కాలంలో నిలిచిపోయాయి. కానీ జగత్కల్యాణం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ.. కొండల రాయుని కొండంత వైభవాన్ని దశదిశలా చాటుతున్నాయ్. సకల దేవతలు హాజరై తిలకించే ఉత్సవాలను వీక్షించడం.. మహద్భాగ్యంతో భక్తులు భావిస్తారు.థ్వజారోహణతో ప్రారంభమై... ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు పరిసమాప్తమౌతాయ్. విశిష్ట ఉత్సవాలను పురస్కరించుకుని.. ఉత్సవాలకు ముందు రోజున వచ్చే మంగళవారం నాడు... అర్చకులు... అధికారులు సంయుక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతోనే ఉత్సవ శోభ మొదలైతుంది.ఆ తరువాత శ్రీవారి ఆలయాన్ని నేత్రానందంగా పరిమళ భరిత పుష్పాలతోనూ... విద్యుద్దీపాలతోనూ పూల పందిళ్లతోనూ.... అందంగా అలంకరిస్తారు.
థ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. థ్వజారోహణం నాడు... శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామి సమక్షంలో వేదమంత్రోఛ్చారణల మధ్య మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా... అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరుఢ థ్వజాన్ని ఎగురవేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే ఈ కార్యక్రమం... వేడుకగా నిర్వహించిన తరువాత....ఇక శ్రీవారి వాహన సేవలు ప్రారంభమౌతాయ్. రోజూ ఉదయం రాత్రి వేళల్లో స్వామి అమ్మవార్లతో కలసి వివిధ వాహనాలపై ఉరేగే ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని వీక్షించడానికే భక్తకోటీ తిరుమలకు పోటెత్తుతుంది. పరిమళ భరిత పూమాలల నడుమ... దివ్యాభరణాలను ధరించి స్వామి దేవేరులతో కలసి తిరుమాఢ వీధుల్లో సాగించే.. వాహన విహార వైభోగం... చూసిన వారికి చూసినంత.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి వాహనసేవకు విశేష ప్రాధాన్యం ఉంది.. స్వామి వారు పెద శేషవాహనం, చిన శేషవాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం,గరుడ వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం,సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం,అశ్వ వాహనాల పై 9 నాళ్లూ ఊరేగి భక్తులకు కనువిందు కలిగిస్తాడు... ఆ కోనేటి రాయుడు. మోహినీ అవతారంలో మురిపించి ధగధగలాడే స్వర్ణరథంపై అనుగ్రహ కాంతులు వెదజల్లుతూ... చెక్కరధం పై భక్తులను కఠాక్షిస్తూ స్వామి మాఢ వీధుల్లో ఊరేగి.. అభయ ప్రదానం చేస్తారు.
ఇక బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. స్వామి వాహనం గరుత్మంతుడు..ఉత్సవాల్లో ఐదవ రోజు రాత్రి జరిగే గరుడోత్సవం పురస్కరించుకుని... సప్తగిరులు భక్తగిరులుగా మారిపోతాయి. గోవిందనామస్మరణలతో ఏడుకొండలు మారుమ్రోగతాయి. కొండంత దేవుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు... తిరుమలకు పోటెత్తుతారు. రోజుకొక్క వాహనంతో రోజుకొక్క అలంకరణలతో శ్రీవారి వాహన సేవలు...ఆద్యంతం ఆనందమయంగా సాగుతాయి. అందుకే తిరువీధుల మెరసీ దేవదేవుడు.. గరిమల మించిన సింగారముల తోడను అంటూ... ఉత్సవ వైభవాన్ని తన కీర్తనలో కళ్లకు కట్టినట్లు వర్ణించాడు... అన్నమయ్య...
శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో విశిష్టమైన పర్వదినాలు.. ఇంతకంటే ముఖ్యమైన కార్యక్రమం ఏదీ తిరుమలకు ఉండదు.. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు రానున్నారు.. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మాడవీధులలో ఉండే సమస్యలు.. గరుడ వాహనంపై ఊరేగే సమయంలో భక్తులకు స్వామిని వీక్షించేందుకు సైతం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. లక్షల్లో వచ్చే భక్తుల కోసం భోజన సదుపాయాలు కల్పించనున్నారు.
ఈ సారి బ్రహ్మోత్సవాల్లో భద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.. భద్రతా ఏర్పాట్లలో భాగంగా తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉపగ్రహ నిఘాను ఉంచనున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ చెప్పారు. ప్రతి ఘటనపై పూర్తి స్థాయి నిఘాను పెట్టారు. అలాగే కొన్ని స్వచ్చంద సంస్థలను బ్రహ్మోత్సవాల సేవలకు వినియోగిస్తున్నారు. మరోవైపు టీటీడీ సభ్యులకు సైతం అనేక కార్యక్రమాలకు బాధ్యులను చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



