నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఉపాధ్యాయులే!

నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఉపాధ్యాయులే!
x
Highlights

విద్య ఎంత ముఖ్యమో, విలువలు కూడా అంతే ముఖ్యమని, తాను ఈ స్థాయికి వచ్చానంటే కారణం ఉపాధ్యాయులే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

మంగళగిరి: విద్య ఎంత ముఖ్యమో, విలువలు కూడా అంతే ముఖ్యమని, తాను ఈ స్థాయికి వచ్చానంటే కారణం ఉపాధ్యాయులే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన శిలఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఏర్పాటుచేసిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. డాన్ బాస్కో ప్రేమ్ నివాస్ పాఠశాల వ్యవస్థాపకులు రెవరెండ్ ఫాదర్ తోమస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలకు అమ్మగా, నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. పెద్దలు చెప్పినట్లు కృతజ్ఞతా భావం చాలా అవసరం. మనం గొప్ప పనులు చేయలేకపోవచ్చు.. కానీ మనం చేసే చిన్న చిన్న పనులు ప్రేమతో చేయవచ్చని మదర్ థెరిసా చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు చేపడుతున్న డాన్ బాస్కో ప్రేమ నివాసానికి గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు.

విద్య ఎంత అవసరమో విలువలు కూడా అంతే ముఖ్యం

‘‘విద్య ఎంత ముఖ్యమో విలువలకు కూడా అంతే ముఖ్యం. మీరు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు విలువలతో కూడిన నిర్ణయం చాలా ముఖ్యం. విజయానికి దగ్గరి దారులు ఉండవు. దానికి ఉదాహరణే డాన్ బాస్కో. ప్రేమతో అనేక సేవలు మనకు అందిస్తున్నారు. డాన్ బాస్కో 50 ఏళ్లు కాదు..వెయ్యేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకోవాలని కోరుకుంటున్నాను.’’ అని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories