న్యాయ విచారణ సామాన్యునికి సైతం అర్ధం కావాలి : జస్టిస్ ప్రశాంత్ కుమార్


న్యాయ వ్యవస్థకు జిల్లాల న్యాయ వ్యవస్థ మూల స్థంభం అని సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు.
గుంటూరు : న్యాయ వ్యవస్థకు జిల్లాల న్యాయ వ్యవస్థ మూల స్థంభం అని సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన "రాజ్యాంగ దృక్కోణం - జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర" (అప్ హోల్డింగ్ ద కానిస్టిట్యూషనల్ విజన్ - ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జూడీషియరీ) అనే సెమినార్ లో సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు. ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ అతి పెద్దదని అన్నారు. అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉత్తమ లక్షణాలను కలిగి ఉందన్నారు.
న్యాయ వ్యవస్థలో ప్రతి అంశంలో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా, స్థైర్యంగా ఉండాలని సూచించారు. రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమ స్థానం కల్పించినట్లు చెప్పారు. ఉత్తమ న్యాయం అందించడమే న్యాయ వ్యవస్థ ప్రధాన విధిగా గుర్తించాలని సూచించారు. సామాన్యునికి న్యాయం చేరువ కావడానికి న్యాయ వ్యవస్థ పనితీరు మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. న్యాయ స్థానంలో జరిగే విచారణ సామాన్యునికి సైతం అర్ధం కావాలని, అప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని చెప్పారు.
న్యాయ వ్యవస్థ చట్టానికి, గౌరవానికి వారధిగా పనిచేయాలని అందుకు న్యాయ మూర్తులుగా విలువలు, బాధ్యతలు పాటించాలని, మంచి క్రమ శిక్షణ, న్యాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఉద్బోధించారు. పోటీ తత్వంలో విజయం సాధించే దిశగా ప్రతి న్యాయ మూర్తి తయారు కావాలని, రోజు రోజుకు పరిజ్ఞానం పెంపొందించుకోవాలని అన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడటం ఒకటే విధులలో భాగం కాదని, ప్రతి అంశాన్ని స్పృశించడం ముఖ్యమన్నారు. ప్రస్తుత విధులు నిర్వహణతోపాటు పాత రికార్డులు చదవడం ద్వారాను అపారమైన అవగాహన కలుగుతుందని అన్నారు. తీర్పులు ఇవ్వడం ఒక్కటే న్యాయ వ్యవస్థ ప్రక్రియ కాదని, ఆ తీర్పులో నిబద్ధత ఉండాలన్నారు. తీర్పు ఇవ్వడంలో న్యాయమూర్తి ప్రవర్తన అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. రాజ్యాంగం సూచించిన మార్గదర్శకాలలో శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ నడవాలని, అది కేవలం న్యాయపరమైన డాక్యుమెంట్ మాత్రమే కాదని స్పష్టం చేశారు.
రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. ఇందులో జిల్లా న్యాయ వ్యవస్థకు సముచిత స్థానం ఉందని, ప్రతి వ్యక్తి మొదటగా జిల్లా న్యాయ వ్యవస్థ వద్దకు మాత్రమే వస్తారని అన్నారు. అనేక తీర్పులు పౌరుల నమ్మకం, విశ్వాసం చూరగొన్నాయని న్యాయమూర్తి చెప్పారు. కేసుల విచారణ చాలా దశల్లో జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల హక్కులు కాపాడాలని, సాంకేతికత ఎంత వచ్చినప్పటికీ న్యాయం అనేది మానవతా దృక్పథంపై ఆధారపడిందని అన్నారు. అత్యుత్తమ తీర్పులు (ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్) ఇవ్వడం ఒక్కటే పనితీరుకు నిదర్శనం కాదని, రోజువారి వ్యవహారాలను నిబద్ధతతో, పౌరుల నమ్మకం మేరకు పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి గొప్పదని వివరించారు.
ఇచ్చే తీర్పులు ప్రజలను ఆకర్షించక పోవచ్చని, కానీ ఒక వ్యక్తికి గొప్ప ఉపశమనం కలిగించవచ్చని అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయ మూర్తి ప్రశాంతత, నిగ్రహం, ఓపిక, స్థైర్యంతో వ్యవహరించాలని అప్పుడే నిజాయితీ, నిష్పక్షపాత తీర్పులు ఇవ్వగలరని అన్నారు. కొన్ని సమయాల్లో క్లిష్టతరమైన, అతివిశ్వాసంతో కూడిన సాక్ష్యాలు విచారణలో రావచ్చని తెలిపారు. తీర్పులు ఇవ్వడం అంటే వివాదాలను పరిష్కరించడం మాత్రమే కాదని, న్యాయానికి ఒక మంచి రూపు ఇవ్వడమని అభిప్రాయపడ్డారు. మంచి తీర్పులు ఇచ్చుటకు ఏమి చేయాలో స్పష్టమైన ప్రణాళిక, అవగాహన ఉండాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదరాబాదరా తీర్పులు ఇవ్వరాదని చెప్పారు. కనిపించేవి, కనిపించని అనేక కారకాలు ఉండే అవకాశాలు ఉంటాయని అటువంటి సమయంలో కష్టమైన వైఖరితో ఉండాలని చెప్పారు.
రాజ్యాంగం ప్రతి వ్యక్తి నిజ జీవితంలో ప్రతిరోజు చేపట్టాల్సిన అంశాలను పొందుపరచడం జరిగిందని వాటిని ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో అమలు చేసి వారి పాత్రలో కీలకం కావాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ పాట్రన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, జిల్లా న్యాయవ్యవస్థ న్యాయవ్యవస్థలోకే ముఖ్యమైనదని అన్నారు. జీవించే హక్కు కలిగి ఉండడం అంటే వ్యక్తి జీవించడం ఒకటే కాదని, మంచి జీవనాన్ని గడిపే హక్కు కలిగి ఉండటం అని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ పనితీరులో ఏమాత్రం అశ్రద్ధ ఉన్నా అధికరణ 14, 15 ప్రకారం న్యాయాన్ని సక్రమంగా వెలువరించడం సాధ్యం కాదని అన్నారు. రాజీలేని న్యాయ వ్యవస్థను నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. రాజ్యాంగాన్ని సక్రమంగా పరిరక్షించుకోవడమే రాజ్యాంగానికి ఇచ్చిన విలువ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయ మూర్తి, జ్యుడిషియల్ అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హారి మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రతి వ్యక్తికి పౌర హక్కులు ఇచ్చిందన్నారు. వీటిని జిల్లా న్యాయ వ్యవస్థ పటిష్టంగా రక్షణ కల్పించాలన్నారు. మహిళలు, చిన్నారులు పై వచ్చే వివాదాలు చాలా మేరకు సున్నితమైనవని, సరైన ప్రక్రియ ద్వారా పరిష్కరించాలని అన్నారు. క్షేత్రస్థాయిలోనే స్పష్టమైన విధానాన్ని అవలంబించడం ద్వారా కేసుల పరిష్కారంలో రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు చేయవచ్చని చెప్పారు. రాజ్యాంగ పీఠికలో ప్రతి పౌరునికి ఆర్థిక, సామాజిక, సౌబ్రాతృత్వం వంటి అంశాలను కల్పించిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం కుమార్, హై కోర్టు న్యాయమూర్తులు, జిల్లా ప్రధాన న్యాయ మూర్తులు, రాష్ట్రంలో వివిధ జిల్లాలో పనిచేస్తున్న న్యాయ అధికారులు పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



