ప్రమోషన్ల ఆనందం సేవల్లో కనిపించాలి: పవన్ కళ్యాణ్

ప్రమోషన్ల ఆనందం సేవల్లో కనిపించాలి: పవన్ కళ్యాణ్
x
Highlights

ప్రమోషన్ల ద్వారా పొందిన ఆనందం ప్రజలకు సేవచేయడంలో కనిపించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు.

మంగళగిరి: ప్రమోషన్ల ద్వారా పొందిన ఆనందం ప్రజలకు సేవచేయడంలో కనిపించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. మంగళగిరిలో బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మాటా మంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సాధకబాధకాలు నాకు తెలుసు. నా శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఏం చేయగలనని మొదటి నుంచి ఆలోచించాను. ఉన్నతాధికారులను అడిగితే తీసుకురావాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయని చెప్పారు. ఒక ప్రమోషన్ వస్తే ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వారు మరింత ప్రభావవంతంగా పని చేస్తారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారాన్ని బలంగా, పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లాము’’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రమోషన్లతో మీరు ఎంత సంబరపడ్డారో.. మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే ఆనందపడాలన్నారు. ప్రజలకు సేవలు అందించే క్రమంలో మీరంతా నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర పాలనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశాం.. మరిన్ని అమలు చేయబోతున్నామన్నారు. చట్టబద్దంగా మీకు చేయగలిగినవన్నీ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది

“పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నా. అనుభవం ఉన్న అధికారి పర్యవేక్షణ కావాలని శశిభూషణ్ కుమార్ ని ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నాం. ఉపముఖ్యమంత్రి హోదాలో ఎక్కడా నా సొంత తెలివితేటలు వాడలేదు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే ఒప్పు అన్న పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. శశిభూషణ్ కుమార్, కృష్ణతేజ, వెంకటకృష్ణ లాంటి నిబద్దతతో పని చేసే బలమైన అధికారులు నాతో ఉన్నారు. వారి అనుభవంతో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. గత ప్రభుత్వ పాలనలో చాలా అంశాల్లో పారదర్శకత లేదన్న విషయాన్ని వీరు నా దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అభివృద్ధి చేయలేదు. కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రతి పోస్టుకీ, బదిలీకి ఒక రేటు కార్డు ఉండేది. ఇలాంటి పరిస్థితులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన వరకు ఉద్యోగులకు ఎంత పారదర్శకంగా వ్యవహరించగలమనే ఆలోచన చేశాం’’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

పూర్తి పారదర్శకంగా పదోన్నతులు

‘‘పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఔట్ సోర్సింగ్ తో కలిపి సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి పదోన్నతులు కల్పించే వ్యవహారంలో కార్యాలయ అధికారులు వెన్నెముకలా నిలిచారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవస్థ ప్రక్షాళణకు సంస్కరణలు అవసరం అని వారు చెప్పేవారు. సమీక్షల సమయంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పదోన్నతుల వ్యవహారంలో నేను కల్పించుకోను అని ముందే చెప్పా. అయితే, పాదర్శకతతో కూడిన పాలన కావాలని మాత్రమే కోరుకున్నా. సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా నివేదికలు ఇవ్వాలని సూచించా. బదిలీలు, పదోన్నతులపై ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లెటర్లు ఇచ్చారు. సిఫార్సు పొందిన ఉద్యోగికి నిర్దేశిత ప్రమాణాలకు తగ్గ అర్హత ఉంటేనే దాన్ని ఆమోదించాలని స్పష్టంగా చెప్పాం.’’ అని డిప్యూటీ సీఎం వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories