అమ్మఒడి నగదు అడిగినందుకు..విద్యార్థిని చితకబాదిన ప్రధానోపాధ్యాయుడు

Representational Image
విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో అమ్మఒడి నగదు రాలేదని అడిగినందుకు ఓ విద్యార్థిని చితకబాదాడు...
విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో అమ్మఒడి నగదు రాలేదని అడిగినందుకు ఓ విద్యార్థిని చితకబాదాడు ప్రధానోపాధ్యాయుడు. రూపేష్ అనే విద్యార్థి సొంత గ్రామంలోనే 8వ తరగతి వరకు చదివాడు. ఇక తొమ్మిదో తరగతి నర్సింగబల్లిలో చదువుతున్నాడు. 8, 9వ తరగతికి సంబంధించిన అమ్మఒడి నగదు రాలేదని ఏనుగుతుని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మని అడగ్గా ఆయన వీరావేశంతో విద్యార్థిపై చేయి చేసుకున్నాడు.
ప్రస్తుతం చదువుతున్న పాఠశాల మేడమ్‌ని అడగకుండా తనను ఎందుకు అడుగుతున్నావని విద్యార్థి చెంప ఛెళ్లు మనిపించాడు హెచ్ఎం. రూపేష్ తండ్రిని కూడా తన వద్దకు రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అయితే తాను చెప్తే ఆయన వినరనీ, మీరే చెప్పండి అని ఆ విద్యార్థి చెబుతున్నా ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోలేదు. ఓ దశలో మెడ పట్టుకుని మరీ చెంపలు వాయించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఘటనపై ప్రధానోపాధ్యాయుడు శర్మను వివరణ కోరగా విద్యార్థి రూపేష్, అతని అన్నయ్యకి వేర్వేరు బ్యాంకు అకౌంట్ ఖాతాలు ఇవ్వడం వల్లే నగదు పడలేదని వివరణ ఇచ్చారు. ఒకే బ్యాంకు అకౌంట్ ఇవ్వాలని విద్యార్థి తండ్రి దుర్గారావుకు చెప్పామన్నారు. అయితే దుర్గారావు మద్యం సేవించి వచ్చాడని నా వల్లే అమ్మఒడి నగదు రాలేదని దురుసుగా మాట్లాడారని హెచ్‌ఎం చెబుతున్నాడు. విద్యార్థి రూపేష్ సైతం అమర్యాదగా మాట్లాడటంతో మందలించాల్సి వచ్చిందని ప్రధానోపాధ్యాయుడు చెప్పుకొచ్చారు.