Thandava Reservoir: రిజర్వాయర్లలో జలకళ..తాండవ దిగువకు 1,000క్యూసెక్కుల నీరు విడుదల..

Thandava Reservoir: రిజర్వాయర్లలో జలకళ..తాండవ దిగువకు 1,000క్యూసెక్కుల నీరు విడుదల..
x

Tandava(file image)

Highlights

Thandava Reservoir: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని జలాశయాలు నీటితో నిండుగా కళకళలాడుతున్నాయి.

Weather | రెండు రోజుల్లో గరిష్ట వర్షపాతం నమోదు..

రావణాపల్లిలో స్థిరత్వంగా గరిష్ట నీటి మట్టం

రెండింటిలోనూ కొనసాగుతున్న ఇన్ ఫ్లో

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని జలాశయాలు నీటితో నిండుగా కళకళలాడుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూలేని విధంగా కేవలం రోజుల వ్యవధిలో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో విశాఖ జిల్లాలో ఏకైక మేజరు ప్రాజెక్టు తాండవ, నర్సీపట్నంనకు సమీపంలో ఉన్న రావణాపల్లి జలాశయంలో గరిష్టస్థాయికి నీరు చేరుకోగా, ముందు జాగ్రత్త చర్యగా దిగువకు నీటిని వదులుతున్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ప్రధానంగా నర్సీపట్నం పరిసర ప్రాంతాలపై ప్రభావం చూపించింది. గత రెండు రోజుల్లో నర్సీపట్నంలో దాదాపుగా 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యింది. తాండవ ఎగువ ప్రాంతాల్లో అది మరింత ఎక్కువయ్యింది. దీంతో వరి పంటలకు సరిపడా నీరు సమకూరడంతో పాటు తాండవ, రావాణాపల్లి రిజర్వాయర్లకు ఎగువ నుంచి అధిక స్థాయిలో వచ్చి నీరు చేరింది.

జిల్లాలో ఏకైక మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు నుంచి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 52 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. ఏటా ఒక పంటకు దీని నుంచి ఆయకట్టు భూములకు నీటిని సరఫరా చేస్తారు. అయితే ఈ ఏడాది పరిస్థితి అనుకూలించడంతో సీజను ప్రారంభం నుంచి నీటి సమస్య లేకుండా సాగుకు అందిస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా రిజర్వాయరు ఎగువ ప్రాంతాల్లో అధికారుల లెక్కల ప్రకారం సుమారుగా 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యింది. దీంతో కేవలం 12 గంటల సమయంలో ఒక్కసారే 1,200 నుంచి 1,500లకు ఇన్ ఫ్లో పెరిగి అడుగు నీటి మట్టం పెరిగింది. దీంతో గరిష్ట నీటి మట్టం 380 అడుగులు కాగా, ఆదివారం మధ్యాహ్ననికల్లా 379.4 అడుగులకు చేరుకుంది. ఈ విధంగా నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు సుమారుగా 1,000 క్యూసెక్కుల వరకు దిగువకు విడుదల చేశారు. వర్షం కాస్త తగ్గుదల పట్టినా సోమవారం మధ్యాహ్నానికి ఇన్ ఫ్లో 1,200 క్యూసెక్కుల వరకు కొనసాగుతుండటం విశేషం.

ఇక నర్సీపట్నంనకు సమీపంలో ఉన్న రావణాపల్లి రిజర్వాయరుకు సంబంధించి నర్సీపట్నం, గొలుగొండ మండలాలకు సంబంధించి సుమారుగా 2,500 ఎకరాల వరకు సాగునీరందిస్తుంటుంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు గాను నీరు గరిష్ట నీటిమట్టం 359 అడుగులుకాగా, 358.5 అడుగుల వద్ద స్థిరత్వంగా కొనసాగుతోంది. అయితే ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లోకు అనుగుణంగా దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వర్షపాతం పంటల సాగుకు అనుకూలంగా ఉండటంతో దిగుబడి విషయంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories