Krishna River: నాలుగు రాష్ట్రాలు కలసి కృష్ణా నదిని చంపేస్తున్నాయా?


Krishna River: నాలుగు రాష్ట్రాలు కలసి కృష్ణా నదిని చంపేస్తున్నాయా?
Krishna River: కృష్ణా నది మరో మూసీగా మారుతోందా? పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజీ వాటర్ ఇష్టానుసారంగా వదలడంతో కృష్ణా నీరు తాగు నీటి అవసరాలకు పనికిరాకుండాపోయే ప్రమాదం పొంచి ఉందా? అంటే అవునని తాజా నివేదికలు చెబుతున్నాయి.
Krishna River: కృష్ణా నది మరో మూసీగా మారుతోందా? పారిశ్రామిక వ్యర్థాలు, డ్రైనేజీ వాటర్ ఇష్టానుసారంగా వదలడంతో కృష్ణా నీరు తాగు నీటి అవసరాలకు పనికిరాకుండాపోయే ప్రమాదం పొంచి ఉందా? అంటే అవునని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు నీరు, సాగు నీరు లేకుండా పోతుంది.
వరంగల్ నిట్ రిపోర్ట్
భారతదేశంలోని మూడవ అతిపెద్ద నది కృష్ణానది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న ఈ నది కాలుష్యం కోరల్లో చిక్కుకుందని వరంగల్ నిట్, సూరత్ కల్ నిట్ సంస్థలు ఉమ్మడిగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. పారిశ్రామిక వర్గాలు, మురుగు నీరు యధేచ్ఛగా వదులుతుండడంతో ఈ నది నానాటికీ మురికి కూపంగా మారుతోందన్నది ఈ రిపోర్ట్ సారాంశం.
కృష్ణానది ప్రవాహాన్ని ఆసాంతం అధ్యయనం చేసే బాధ్యతను వరంగల్, సూరత్ కల్‌లలోని నిట్‌లకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అప్పగించింది. కాలుష్యానికి కారణాలను పరిశీలించమే కాకుండా, పరిష్కార మార్గాలు కూడా సూచించాలని కూడా జల మంత్రిత్వ శాఖ ఆ సంస్థలను కోరింది. అందుకోసం, కేంద్ర 6.3 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేసింది.
ఈ రెండు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలు మహారాష్ట్రలోని మహాబలేశ్వరం నుంచి ఏపీలని కృష్ణపట్నం వరకు కృష్ణానది ప్రవహించే 1,400 కిలోమీటర్ల ప్రాంతాన్ని అధ్యయనం చేశాయి. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు విద్యుత్ కోసం, వ్యవసాయం కోసం ఈ నది మీదే ఆధారపడుతున్నాయన్న సంగతి తెలిసిందే. అయితే, అలాంటి నది పట్ల ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
నది ప్రాణం తీస్తున్న పరిశ్రమలు
నాలుగు రాష్ట్రాలలోని కెమికల్ ఫ్యాక్టరీలు, మెటలర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు భారీయెత్తున వ్యర్థాలను ఈ నదిలోకి వదిలిపెడుతున్నాయని ఈ రిపోర్టు తెలిపింది. నది కాలుష్యంలో 31.38 శాతం ఈ పరిశ్రమలేనని తేల్చిచెప్పింది. ఇవి కాకుండా ఇంజనీరింగ్ పరిశ్రమల మరో 22 శాతానికి బాధ్యులని, మిగతా కాలుష్యం టెక్స్ టైల్స్, మైనింగ్, షుగర్ తదితర పరిశ్రమల నుంచి వస్తోందని నిట్ రిపోర్ట్ వివరించింది. మొత్తంగా 427 పరిశ్రమలు ఈ నదిని భ్రష్టు పట్టిస్తున్నాయని, వాటిలో అధిక భాగం కెమికల్ ఇండస్ట్రీలేనని స్పష్టం చేసింది.
ఎవరి పాపం ఎంత?
ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఎలాంటి వ్యర్ధాలు నదిలో కలుస్తున్నాయో కూడా ఈ ప్రాథమిక రిపోర్ట్ వివరించింది. మచ్చుకు మహారాష్ట్రలోని సంగ్లీ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రాలయం లో కర్ణాటకలోని బాగల్ కోట్ ప్రాంతాల నుంచి అర్బన్ వేస్టేజ్ కలుస్తున్నాయి.
ఇక తెలంగాణకు వచ్చేప్పటికి కృష్ణానదిలో ఫార్మా వ్యర్థాలు ఎక్కువగా కలుస్తున్నాయి. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాన్ని దుష్ప్రభావానికి గురి చేస్తోంది. కృష్ణా నది మీద కట్టిన సాగర్ డ్యామ్ వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతో పాటు గణనీయమైన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేసరికి నదీ జలాల్లో ఆక్సిటన్ పరిమాణం భారీగా తగ్గుతోంది. పాడైపోయిన ఆర్గానిక్ వ్యర్థాల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఉదాహరణకు, కర్నూల్ లోని పేపర్ మిల్స్ నుంచి ఈ నదిలోకి 35 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల వేస్టేజ్ వాటర్ వచ్చి చేరుతోంది. నీటి నాణ్యతను బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్... అంటే బీఓడీతో సూచిస్తారు. నదిలోకి వచ్చి చేరే ఆర్గానికి వ్యర్థాలను డీకంపోజ్ చేయడానికి బీఓడీ విలువలు ఎక్కువ మోతాదులో ఉండాలి. కానీ, ఏపీకి వచ్చేసరికి నది బయో వ్యర్థాలను కూడా భరించలేని స్థితికి చేరుకుంటోంది.
అయితే, అన్నింటికన్నా ఎక్కువ కాలుష్యాన్ని గుమ్మరిస్తున్నది మాత్రం మహారాష్ట్రేనని ఈ రిపోర్ట్ తెలిపింది. సంగ్లీ, భీమా, హరిపూర్, పంధార్ పూర్ వంటి ప్రాంతాలలో అత్యధికంగా కాలుష్య కారకాలు కృష్ణలో కలుస్తున్నాయి.
ఇక కర్నాటకలోని పాలిఫైబర్ పరిశ్రమలు నదికి చేస్తున్న హాని అంతా ఇంతా కాదు. ఈ రాష్ట్రంలోని పాలిఫైబర్ ఇండస్ట్రీలు ప్రతిరోజూ 35 వేల క్యూబిక్ మీటర్ల నది నీటిని వినియోగించుకుని, 33 వేల క్యూబిక్ మీటర్ల కాలుష్య జలాలను వదులుతున్నాయి.
కృష్ణా నదిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి?
కృష్ణానదిని కాపాడుకోవాలంటే ముందుగా పరిశ్రమల వ్యర్థాలకు చెక్ పెట్టాలి. నది వెంట ఉన్న పరిశ్రమల నుంచి వ్యర్ధాలను శుద్ది చేసిన తర్వాతే నదిలోకి వదిలే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కాలుష్యాలను అలాగే వదలకుండా పరిశ్రమలు సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఈ అధ్యయనం సూచించింది.
అంతేకాకుండా, నది నీరు కలుషితమైతే ఎదురయ్యే ప్రమాదాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. పశ్చిమ కనుమల్లో అడవుల నరికివేతతో కృష్ణా నది సహజ ప్రవాహ గతి మారింది. దీంతో నేల కోత పెరిగి జీవ వైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. అందుకే, నదీ పరీవాహక ప్రాంతంలో చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేయాలని ఈ నివేదిక సూచించింది.
నదికి శాపంగా మారుతున్న మరో సమస్య ఇసుక రవాణా. భారీయెత్తున కృష్ణా తీరం నుంచి ఇసుకను తరలిస్తుండడంతో నది ఒడ్డు అంతా కోతకు గురవుతోంది. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
ఒకవైపు, మురికి కూపంగా మారిన మూసీ నదిని లక్షన్నర కోట్లతో ప్రక్షాళన చేసి, సుందరీకరించాలని తెలంగాణ ప్రభుత్వం పథకాలు వేస్తోంది. కానీ, మరో వైపు కృష్ణానదిలో కూడా ప్రమాదం ముంచుకొస్తోంది. అది కూడా మూసీలా మారక ముందే ప్రభుత్వాలు మేల్కొనాలి. తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే, సుందరీకరణ సంగతి తరువాత తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరకని పరిస్థితి ఎదురవుతుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



