జగన్ దగ్గరికి వెళ్లి ఋణం తీర్చుకుంటా: తెలంగాణ పోలీస్ అధికారి

జగన్ దగ్గరికి వెళ్లి ఋణం తీర్చుకుంటా: తెలంగాణ పోలీస్ అధికారి
x
Highlights

తెలంగాణ సిఐడి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు ఓ ఇంటర్వ్యూ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసో లేదంటే రెండున్నరేళ్ల తరువాతనో వెళ్లి వైసీపీలో చేరుతానని తెలిపారు.

తెలంగాణ సిఐడి అడిషనల్ ఎస్పీ హనుమంతరావు ఓ ఇంటర్వ్యూ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసో లేదంటే రెండున్నరేళ్ల తరువాతనో వెళ్లి వైసీపీలో చేరుతానని తెలిపారు. జగన్ పార్టీలో చేరి తన దేవుడు వైఎస్ఆర్ గారి ఋణం తీర్చుకుంటానని అన్నారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయినా పునర్జన్మనిచ్చింది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారేనని అన్నారు.

తన కుటుంబం ఇవాళ జీవించి ఉంది అంటే అది వైఎస్ఆర్ గారి చలవేనని చెప్పారు. పవన్ కళ్యాణ్ తనను ప్రజారాజ్యంలో చేరడానికి కీలక పాత్ర పోషించారని అన్నారు. కుటుంబసభ్యులు వద్దని వారిస్తున్నా వినకుండా పొలిసు ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ.. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి సర్వం కోల్పోయానని..

ఆ సమయంలో తన కుటుంబం రోడ్డున పడిందని అన్నారు.. దాంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్న సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తనను అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లారని.. దాంతో వైఎస్ఆర్ నా పరిస్థితిని చూసి మళ్ళీ ఉద్యోగంలో తీసుకున్నారని అన్నారు. అంతేకాదు ఎక్కడ పోస్టింగ్ కావాలో కూడా వైఎస్ఆర్ గారు కోరుకోమన్నారని చెప్పారు. ఆయన ఆ సమయంలో తనను తిరిగి ఉద్యోగంలో తీసుకోకపోతే ఇప్పుడు ఈ స్థాయిలో తన కుటుంబం ఉండేది కాదన్నారు.

అంతేకాదు తన ఇద్దరు పిల్లల్లో ఒక కొడుకు సెటిల్ అయ్యాడని.. ఇంకో కుమారుడు త్వరలో సెటిల్ అవుతాడని.. అది జరిగిన మరుసటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్ దగ్గరికి వెళతానని అన్నారు. వైసీపీలో చేరి సాధారణ కార్యకర్త లాగా పనిచేస్తానని.. ఆ రకంగా అయినా తన దేవుడు వైఎస్ఆర్ గారి ఋణం తీర్చుకుంటానని హనుమంత రావు అన్నారు. కాగా ప్రకాశం జిల్లాకు చెందిన హనుమంతరావు 2009 ఉద్యోగానికి రాజీనామా చేసి విజయనగరం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దాదాపు 14 వేల ఓట్లు సాధించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత తిరిగి పోలీస్ డిపార్టుమెంటులో జాయిన్ అయ్యారు హనుమంతరావు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories