ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన టీడీపీ ఎమ్మెల్యే

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన టీడీపీ ఎమ్మెల్యే
x
Highlights

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామాణాయిడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పల్గల్లు నుంచి చిక్కల వరకు ప్రయాణికులతో కలిసి...

టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామాణాయిడు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పల్గల్లు నుంచి చిక్కల వరకు ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. ఇటీవల రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకునేందుకు ఆయన బస్సులో వెళ్లారు. అంతకుముందు ఎమ్మెల్యే రామాణాయిడు పాలకొల్లు బస్ స్టాండ్ వద్ద ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. బస్సు ఛార్జీల పెంపుతో ప్రభుత్వం ప్రజలపై 1000 కోట్ల రూపాయల భారం వేసిందని అన్నారు. బస్సు ఛార్జీల పెంపును 50 శాతం పెంచారని అన్నారు. ఈ సందర్బంగా ధరలు పెంచవద్దని గతంలో జగన్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.మద్యం వినియోగాన్ని తగ్గించడానికి మద్యం ధరలు పెంచిన విధంగానే బస్సు ఛార్జీల పెరుగుదలతో ప్రయాణికులను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.

కాగా ఏపీ ప్రభుత్వం ఇటీవల (11-12-2019) నుంచి బస్సు చార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగులో కి.మీకు 10 పైసలు.. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీలో కి.మీకు 20 పైసలు.. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కి.మీకు 10 పైసలు పెంచింది. అయితే వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఛార్జీలను మాత్రం పెంచలేదు. అంతేకాదు సిటీ ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదు.. అలాగే పల్లె వెలుగులో మొదటి 2 స్టేజీలు, 10 కి.మీ వరకు ఛార్జీలను ప్రభుత్వం పెంచలేదు.

ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని, దీనివల్ల నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీకి రూ.6735 కోట్ల అప్పులున్నాయని చెప్పారు. అదీకాక ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టాలు వస్తున్నాయని, అందువల్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. దీనిపై విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే ఆర్టీసీ చార్జీలు పెంచిన ఘనత జగన్ కే దక్కిందని ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories