చిన్నశేష వాహనంపై న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో భక్తులకు కనువిందు చేసిన శ్రీనివాసుడు

చిన్నశేష వాహనంపై న‌వ‌నీత‌కృష్ణాలంకారంలో భక్తులకు కనువిందు చేసిన శ్రీనివాసుడు
x
Highlights

శ్రీనివాసుడు చిన్ని కృష్ణుడు అయ్యాడు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు ఈరోజు చిన్న శేష వాహనం పై నవనీత కృష్ణాలంకారంలో తిరుమాడ వీధుల్లో భక్త జనకోటి మధ్య సేవలు అందుకున్నారు.

(తిరుమల, హెచ్ ఎం టీవీ ప్రతినిధి)


శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై న‌వ‌నీతకృష్ణ అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెమ‌లి పింఛం, పిల్ల‌న‌గ్రోవి, న‌వ‌నీతంతో ఉన్న కృష్ణుడి రూపం భ‌క్తుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి....ఇక మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత మలయప్పస్వామికి రంగనాయకుల‌ మండపంలో స్నపన తిరుమంజనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు...అనంతరం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ ఛైర్మ‌న్ శ్రీ పృథ్విరాజ్, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories