తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ దూకుడు

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ దూకుడు
x
Highlights

ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక వేడి రాజుకుంది. బీజేపీ-జనసేన ఏపీలో పొత్తులో ఉన్నాయి. అభ్యర్థి ఎవరో తేలకుండానే ఇప్పుడు ఎవరికి వారు ప్రచార పర్వలోకి దూకడం రెండు పార్టీల శ్రేణులను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి.

ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక వేడి రాజుకుంది. బీజేపీ-జనసేన ఏపీలో పొత్తులో ఉన్నాయి. అభ్యర్థి ఎవరో తేలకుండానే ఇప్పుడు ఎవరికి వారు ప్రచార పర్వలోకి దూకడం రెండు పార్టీల శ్రేణులను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ -జనసేన సంయుక్త చర్చల తర్వాతే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని బీజేపీ అధినాయకత్వం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఏపీ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని చాటుకోవలన్న ఉత్సాహంతో బీజేపీ దూసుకెళ్తుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి బీజేపీ, జనసేన ఉవ్విళ్లూరుతుంది. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగాలనే అంశాన్ని ఇరు పార్టీలతో కూడిన కమిటీ నిర్ణయిస్తుందని కొద్దిరోజుల క్రితం పవన్ ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి రోడ్ షోలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను కోరారు. జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్థికే ఓటేయాలని తిరుపతిలో బహిరంగంగా చెప్పారు. దీంతో తిరుపతి అభ్యర్థి బీజేపీ నుంచే బరిలో ఉంటారనేది స్పష్టం అయింది. ఓ వైపు కూటమి అభ్యర్థిపై చర్చలు జరుగుతుండగానే ఆయన ఈ ప్రకటన చేయటంతో జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆషామాషీగా రాజకీయాలు చేస్తే పూర్తిగా వెనకబడిపోతామని భావించిన పవన్‌.... ఇటీవల నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలో పర్యటించి...రైతులను ఓదార్చారు. జోరు వర్షంలోనూ తిరుపతిలో పర్యటించి కాకపుట్టించారు. అయితే పవన్‌ వ్యూహం వెనుక నివర్‌ తుఫాన్‌ బాధితులే కాకుండా తిరుపతి ఉప ఎన్నికకూడా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. పవన్ తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఇలా సడెన్ గా బయటకు వచ్చాడని కొందరు అంటున్నారు. బీజేపీ సైతం సొంతంగా తిరుపతిలో ప్రచారం మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఉమ్మడిగానే తిరుపతిలో పోటీచేసేందుకు జనసేన బీజేపీలు గతంలో నిర్ణయించారు. టికెట్ విషయంలో ఇంకా ఎవరికనేది తేలలేదు. దీంతో టికెట్ తేలకుండానే జనసేన బీజేపీలు సొంతంగా ప్రచార పర్వంలోకి దూకడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే సోము వ్యాఖ్యలు జనసేనానికి షాక్‌ ఇచ్చింది.

ఇప్పటికే పొత్తుతో బీజేపీ అదుపు ఆజ్ఞలలో ఉంటూ వచ్చిన పవన్, ఆ పార్టీ వైఖరి తో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంట. తమను బీజేపీ మిత్రపక్షంగా గుర్తించి... తగిన గౌరవం మర్యాదలు ఇవ్వడం లేదు అనే బాధ పవన్‌‌తో పాటు, ఆ పార్టీ నాయకులలోనూ ఉందట. ఇప్పటికే తెలంగాణలోని గ్రేటర్‌లో ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా బీజేపీకి తోక పార్టీగా మిలిగిపోయింది. తిరుపతి ఉప ఎన్నికపై ఆశ పెట్టుకుంటే... కషాయ నేతలు పట్టించుకోకపోగా, బీజేపీ అభ్యర్థిని తిరుపతి లోక్ సభ ఎన్నికలకు దింపాలి అని చూస్తూ ఉండడం పవన్ కు ఆగ్రహం కలిగిస్తుందట.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే మిత్రపక్షం జనసేన పార్టీకి బీజేపీ ఉప ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో పోటీలో ఉండేది తామేనని శోభాయాత్రతో బీజేపీ మెసెజ్‌ ఫార్వాడ్‌ చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. చూడాలి మరి పొత్తు కొనసాగుతుందో... పొడైపోతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories